హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు…

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. న్యూఇయర్‌ సెలబ్రేషన్స్ టార్గెట్ గా నగరంలో డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వేడుకల కోసం డ్రగ్స్‌ సరఫరా చేసేందుకు చెన్నై కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్‌ దందా కొనసాగుతోందని వెల్లడించారు. రూ. 3 కోట్లు విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ డీజీపీ చందనాదీప్తీ వెల్లడించారు. ఇద్దరు డ్రగ్స్‌ పెడ్లర్లను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఈ ముఠాకు హైదరాబాద్ లో సబ్ ఏజెంట్ ఎవరైనా ఉన్నారా? లేక డ్రగ్స్ వినియోగదారులకే అందజేయడానికి వచ్చారా? ఈ డ్రగ్స్ ఎవరెవరికి సరఫరా చేయనున్నారు? అనే కోణంలో ఆరా తీస్తున్నాట్లు చందన వెల్లడించారు. ఈ బృందానికి అంతర్జాతీయ ముఠాలతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణం కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక పోలీసులకు చిక్కిన నిందితులు గతంలో ఇదే రకమైన నేరాలకు పాల్పడుతూ పట్టుబడ్డ పాత నేరస్తులుగా గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు నార్కోటిక్‌, నార్త్‌జోన్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ లో న్యూఇయర్‌ వేడుకల పేరుతో డ్రగ్స్‌ వాడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే…