ఆ ఉద్యోగులను ఇళ్లకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు..

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా వివిధ హోదాల్లో కొనసాగుతోన్న ఉద్యోగులను ఇళ్లకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది..బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో పదవీ విరమణ చేసిన కొందరు అధికారులను అనుభవజ్ఞలనే కారణంగా గత ప్రభుత్వం వివిధ స్థాయిల్లో నియమించింది.

ఇలా వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డుల్లో పనిచేస్తోన్న విశ్రాంత అధికారుల వివరాలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం సాయంత్రం 5గంటల్లోగా నిర్ణీత నమూనాలో అలా పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులను సీఎస్‌ ఆదేశించారు.

సిఎస్ ఆదేశాల నేపథ్యంలో పలు శాఖల్లో పనిచేస్తున్న వారి కొనసాగింపు ఉంటుందా? ఉండదా? అనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది..ఇలా పదవీ విరమణ తర్వాత కూడా పనిచేస్తున్న వారిలో పలువరు ఐఏఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో పాటు ఉన్నత స్థానాల్లో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఏడాది నుంచి రెండేళ్ల కాల వ్యవధితో వీరందరికి ప్రభుత్వ ఎక్స్‌టెన్షన్‌ ఇచ్చింది. బిఆర్‌ఎస్‌ హయంలో నియమితులైన వారంతా ప్రభుత్వ సమాచారాన్ని చేరవేస్తున్నారని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో వారందరిని ఇళ్లకు పంపొచ్చని ప్రచారం జరుగుతోంది..