సీడబ్ల్యూసీ.. కీలక నిర్ణయాలు…పార్టి ప్రతిష్ట పై కాంగ్రెస్ దృష్టి..

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. సమావేశంలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మా.లను వెల్లడించారు.. ద్రవ్యోల్బణం, రైతాంగ సమస్యలు, రైతులపై జరుగుతున్న దాడులపై, తాజా రాజకీయ పరిస్థితులపై తీర్మానాలు చేసింది సీడబ్ల్యూసీ.. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి కార్యకర్తల నుంచి నాయకుల వరకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.. పార్టీ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి పార్టీ ఆశిస్తున్న అంచనాలు, ఎన్నికల నిర్వహణ, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన విధానంపై శిక్షణ ఇవ్వాలన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ పై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చింది… సీడబ్ల్యూసీ.. 2021 నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది.. 2022 ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య డీసీసీ ఎన్నికలకు పోటీ పడే అభ్యర్థుల జాబితా ఖరారు చేయనున్నారు.. ఏప్రిల్ 16 నుంచి మే 31 వరకు బూత్ కమిటీలు, బ్లాక్ కమిటీల అధ్యక్షుల ఎంపిక జరగనుండగా.. జులై 21 నుంచి 20 ఆగస్టు వరకు పీసీసీ, ఉపాధ్యక్షులు, కోశాధికారి, పీసీసీ కార్యదర్శి వర్గం, ఏఐసీసీ సభ్యులు ఎన్నిక ఉంటుంది.. 2022 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్టుతెలిపారు కేసీ వేణుగోపాల్. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై సీడబ్ల్యూసీ చర్చించింది.. ధరల పెరుగుదల పై నవంబర్ 14 నుంచి 29 వరకు దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.. మరోవైపు, రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు. సీడబ్ల్యూసీ సమావేశంలో నేతలు అభిప్రాయాలపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్న రాహుల్‌ గాంధీ తెలిపారని పార్టీ వర్గాల సమాచారం..