నందమూరి తారక రామారావు పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంక్రాంతి వేళ సంచలన నిర్ణయం…

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంక్రాంతి వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత రాజకీయాలపై విరక్తి చెందిన ఆయన.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తనతో పాటు తన కుమారుడు కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు వెంకటేశ్వరరావు. ఇక కుటుంబం నుంచి పురంధేశ్వరి మాత్రమే రాజకీయంగా యాక్టీవ్‌గా ఉంటారని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లులో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వేదికగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ ప్రకటన చేశారు.TDP స్థాపన సమయంలో హరికృష్ణతో పాటు ఎన్టీఆర్‌ కలిసి అడుగేశారు దగ్గబాటి. అప్పట్లో వరసగా మూడుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఎంపీగా ఉన్నారు. టీడీపీ సంక్షోభం తర్వాత మాత్రం బీజేపీలో చేరారు దగ్గుబాటి. ఆ తర్వాత 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్‌లో ఉన్నారు. పర్చూరు నుంచే రెండుసార్లు గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఐదేళ్లు సైలెంట్‌గా ఉన్న దగ్గుబాటి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పర్చూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత కూడా పెద్దగా రాజకీయాలు మాట్లాడని ఆయన.. ఇప్పుడు పూర్తిగా స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు.