తొలి ఏడాది తన కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసింది..సీఎం కేసీఆర్.

ధరణి పోర్టల్‌ ప్రారంభమై రేపటితో ఏడాది పూర్తి కానున్నది. గతేడాది అక్టోబర్ 29వ తేదీన ఈ ధరణి పోర్టల్‌ను ప్రారంభించగా.. తొలి ఏడాది తన కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసింది. ధరణి రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్, విచక్షణ లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ ఇది. భూమి సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తున్నది. ఈ పోర్టల్‌ అందుబాటులోకి రావడంతో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రజల ఇంటి ముంగిటకే చేరాయి. గతంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 574 తహసీల్దార్‌ కార్యాలయాల్లో జరుగుతున్నాయి…ధరణి ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకొని, విజయవంతంగా అమలు చేస్తున్నందుకు అధికారులను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని అధికారుల బృందాన్ని, కలెక్టర్లను సీఎం కేసీఆర్‌ అభినందించారు. ధరణితో రైతులు ఎంతో ప్రయోజనం పొందారని సీఎం పేర్కొన్నారు. పారదర్శకంగా, అవాంతరాలు లేని సేవలందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ధరణి మరిన్ని విజయాలు సాధిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌ను విజయవంతం చేసినందుకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధికారులు, కలెక్టర్లు, తహసీల్దార్లకు కృతజ్ఞతలు తెలిపారు.