స్మితా సబర్వాల్ ఇంట్లో చొరబడిన డిప్యూటీ తహసీల్దార్‌ సస్పెన్షన్‌….

తెలంగాణ మహిళా ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ ఇంట్లోకి ప్రవేశించిన డిప్యూటీ తహశీల్దార్‌ ఆనంద్‌ కుమార్‌ రెడ్డిపై వేటు పడింది. ఆనందన్‌ను సస్పెండ్‌ చేస్తూ మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మూడ్రోజుల క్రితం స్మితా సబర్వాల్‌ ఇంట్లోకి డిప్యూటీ తహశీల్దార్‌ చొరబడ్డారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఆనంద కుమార్‌ రెడ్డితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన చంచల్‌ గూడ జైలులో ఉన్నాడు. సస్పెన్షన్‌ ఆదేశాలు జారీ చేశారు..

మేడ్చల్‌ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న చెరుకు ఆనంద్‌కుమార్‌రెడ్డి (48), అతడి స్నేహితుడైన హోటల్‌ యజమాని కొత్త బాబుతో కలిసి కారులో ఈ నెల 19న రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ప్లజెంట్‌వ్యాలీ వద్దకు వచ్చారు. బి-17కు వెళ్లాలంటూ సెక్యూరిటీ గేటు వద్ద సిబ్బందికి చెప్పి, నేరుగా ఆమె నివాసం (బి-11) వద్దకు చేరుకున్నారు.

బాబు కారులో ఉండగా, ఆనంద్‌కుమార్‌రెడ్డి ఆమె ఇంటి మొదటి అంతస్తులోకి వెళ్లి తలుపు తట్టాడు. షాక్ అయిన ఆమె వెంటనే తేరుకొని డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. ఈలోగా భద్రతా సిబ్బంది ఆనంద్‌కుమార్‌రెడ్డిని పట్టుకున్నారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని.. ఐపీసీ సెక్షన్‌ 458, రెడ్‌ విత్‌ 34 కింద కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించారు…కాగా, తనకు ఎదురైన షాకింగ్ ఘటనపై స్మితా సబర్వాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది చాలా భయంకరమైన ఘటన అని, చాలా బాధాకరం అని తెలిపారు. సమయస్పూర్తితో వ్యవహరించి తనను తాను కాపాడుకున్నానని చెప్పారు.