రాజధాని నిర్మాణాన్ని ఏ రకంగానైనా అడ్డుకోవాలనే కుతంత్రంతో జగన్ సరికొత్త కుట్రలకు తెరతీస్తున్నారు..దేవినేని ఉమామహేశ్వరరావు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులను చూసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణాన్ని ఏ రకంగానైనా అడ్డుకోవాలనే కుతంత్రంతో జగన్ సరికొత్త కుట్రలకు తెరతీస్తున్నారని ఆయన ఆరోపించారు.మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవినేని ఉమ మాట్లాడారు. “ప్రస్తుతం అమరావతిలో దాదాపు 30 వేల మంది కార్మికులు, ఇంజనీర్లు భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు శ్రమిస్తూ రాజధానిని నిర్మిస్తున్నారు. ఈ అద్భుతమైన ప్రగతిని కళ్లారా చూస్తున్న జగన్ తీవ్ర అసహనానికి లోనవుతున్నారు” అని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాజెక్టుపై ప్రజల్లో భ్రమలు కల్పించేందుకు ప్రతిపక్షం అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.

Devineni uma: ఐదేళ్ల విధ్వంసానికి కాలం చెల్లింది

గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రాజధాని కోసం కనీసం ఒక్క ఇటుక కూడా వేయకుండా అమరావతిని సర్వనాశనం చేశారని దేవినేని ఉమ దుయ్యబట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో ఐకానిక్ భవనాలు, సీడ్ యాక్సిస్ రోడ్లు, సచివాలయం, హైకోర్టు, హెచ్‌ఓడీ కార్యాలయాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇటీవల జగన్‌ను కలిసిన ఒక వ్యక్తి, కేవలం 24 గంటల్లోనే వాస్తవాలు గ్రహించి తన నిర్ణయాన్ని మార్చుకున్నారని.. రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ప్రస్తావించారు.