అట్టహాసంగా దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర సంబరాలు..

R9TELUGUNEWS.COM. దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర సంబరాలు అట్టహాసంగా జరిగాయి.
రాజ్‌పథ్ మార్గంలో నిర్వహించిన రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా పరేడ్‌ చివర్లో భారత వాయుసేన గగనతలంలో ప్రదర్శించిన విన్యాసాలు హైలైట్‌గా నిలిచాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో తొలిసారి భారత వాయుసేనకు చెందిన 75 విమానాలతో విన్యాసాలు నిర్వహించారు.

పాత విమానాలతో పాటు ఆధునిక ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రఫేల్‌, సుఖోయ్‌, జాగ్వర్‌ వంటి విమానాలు గగనతంలో చేసిన విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాలుగు ఎంఐ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ‘ధ్వజ్‌’ ఆకృతిలో చేరి ఈ విన్యాసాలను ప్రారంభించాయి. ఆ తర్వాత అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు ‘రుద్ర’, ‘రహత్‌’ ఆకృతులను ప్రదర్శించాయి. ఇక 17 జాగ్వర్ యుద్ధ విమనాలు ‘అమృత్‌’(75 సంఖ్య ఆకృతి) రూపంలో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వాయుసేనలో ఇటీవలే చేరిన రఫేల్‌ విమానాలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.

*తొలిసారి కాక్‌పిట్‌ నంచి వీక్షణ..*

తొలిసారిగా భారత వాయుసేన కాక్‌పిట్‌ నుంచి వీక్షణను అందించింది. వాయుసేన విమానాలు గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా.. కాక్‌పిట్‌ నుంచి చిత్రీకరించిన వీడియోలను ప్రదర్శించింది. ఇలా ఆకాశంలో విమాన విన్యాసాల మధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం కావడం ఇదే తొలిసారి.