ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..ఏడుగురు సజీవ దహనం…

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని గోకుల్‌పురి బస్తీలోని ఓ పూరి గుడిసెలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి ఆ ప్రాంతం మొత్తం వ్యాపించడంతో సుమారు 60 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 13 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను ఆర్పివేయడానికి నాలుగు గంటల సమయం తీసుకున్నదని డీఎస్పీ దేవేశ్‌ కుమార్‌ మహ్లా చెప్పారు..ఘటనా స్థలంలో ఏడు మృతదేహాలు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించామన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు..