అల‌క‌నంద న‌దిలో ఓ వింత

ఉత్తరాఖండ్ లో నందాదేవి గ్లేసియర్ విరిగి పడి ధౌలిగంగ నది విలయం సృష్టించింది. హిమ‌నీన‌దాలు విరిగిప‌డి ఆక‌స్మిక వ‌ర‌ద విరుచుకుపడింది. అయితే..ఈ ప్రమాదం జరగడానికి ఒక గంట ముందు…సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాసు గ్రామంలో ఓ వింత చోటు చేసుకుంది. దీనిని చూడ‌టానికి ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఆ వింత జ‌రిగింది అల‌క‌నంద న‌దిలో. ఉద‌యం 9 గంట‌ల స‌మ‌యంలో వేల కొద్దీ చేప‌లు న‌ది ఒడ్డుకు ద‌గ్గ‌ర‌గా చేతికి అందేంత లోతులోనే వెళ్తున్నాయి. ఇది చూసి గ్రామ‌స్థులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ త‌ర్వాత వ‌ల‌లు కూడా అవ‌స‌రం లేకుండా కుప్ప‌లుగా చేతికి అందుతున్న ఆ చేప‌ల‌ను ఇళ్ల‌కు తీసుకెళ్లారు. కానీ మ‌రి కాసేప‌ట్లోనే త‌మ‌కు కొన్నికిలోమీట‌ర్ల దూరంలో ఓ విల‌యం రాబోతున్న‌ద‌ని వాళ్లు ఊహించ‌లేదు. అల‌క‌నంద‌కు ఉప‌న‌ది అయిన ధౌలిగంగ‌లో హిమ‌నీన‌దాలు విరిగి ప‌డి ఆక‌స్మిక వ‌ర‌ద విరుచుకుపడింది.ఇలాంటి విప‌త్తుల‌ను చేప‌లు ముందే గుర్తిస్తాయా అంటే అవున‌నే అంటున్నారు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలోని సీనియర్ సైంటిస్టు శివ‌కుమార్‌. నీటి ప్ర‌వాహంలోని ప్ర‌కంప‌న‌లు చేప‌ల సెన్సర్ వ్య‌వ‌స్థ‌కు ముందే తెలిసి ఉంటుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. చేప‌ల‌కు పార్శ్వ రేఖా అవ‌య‌వాలు ఉంటాయి. వీటి ద్వారా నీళ్ల‌లో క‌ద‌లిక‌లు, ఒత్తిడిలో మార్పును ఇవి గుర్తిస్తాయి. ఇవి చాలా సున్నిత‌మైన‌వి. చిన్న మార్పు కూడా వీటిని క్రియాశీలం చేసి చేప‌లను షాక్‌కు గురి చేస్తాయి అని శివ‌కుమార్ చెప్పారు. ఈ సంద‌ర్భంలో వ‌ర‌ద ముందు వ‌చ్చిన శ‌బ్దాన్ని చేప‌లు ముందే గ్ర‌హించి ఉండ‌వ‌చ్చ‌ని ఆయ‌న అంచ‌నా వేశారు..