డీజిల్‌ ధర లీటరు రూ.25 పెరిగింది..

పెద్ద మొత్తంలో డీజిల్‌ను వినియోగించే బల్క్‌ యూజర్లకు ధరల సెగ తగిలింది. అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 40 శాతం పెరిగిన నేపథ్యంలో దేశీయంగా బల్క్‌ యూజర్లకు హోల్‌సేల్‌గా విక్రయించే డీజిల్‌ ధర లీటరు రూ.25 పెరిగింది. సామాన్య ప్రజలకు మాత్రం ఈ ధరల సెగ ఇంకా తగలలేదు. రిటైల్‌ డీజిల్‌ ధరలు (పెట్రోల్‌ బంకు ధరలు) యథావిధిగా ఉన్నాయి.. బల్క్‌ యూజర్లకు వర్తించే ధరలు రిటైల్‌ ధరలతో పోలిస్తే ఎక్కువ ఉంటాయి. ఈ అధిక ధర నుంచి తప్పించుకోవడానికి వారంతా పెట్రోల్‌ పంపుల వైపు మళ్లారు. మరోవైపు త్వరలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో సామాన్యులు సైతం కొనుగోళ్లను పెంచారు. ఫలితంగా ఈ నెల పెట్రోల్‌ పంపుల దగ్గర విక్రయాలు దాదాపు ఐదోవంతు పెరిగాయి. ఇది రిటైల్‌ విక్రయ సంస్థల నష్టాల పెరుగుదలకు దారితీసింది..ముఖ్యంగా నయారా ఎనర్జీ, జియో-బీపీ, షెల్‌ వంటి ప్రైవేటు రిటైల్‌ విక్రయ సంస్థలు భారీ నష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. గత 136 రోజులుగా ధరలు స్థిరంగా ఉండడంతో.. రాయితీ ధరకు చమురును పొందే ప్రభుత్వరంగ సంస్థలతో ఇవి పోటీపడలేకపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంపులను మూసివేయడం తప్ప మరోమార్గం ఉండదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 2008లో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశవ్యాప్తంగా ఉన్న 1,432 పెట్రోల్‌ పంపులను మూసివేసిందని గుర్తుచేశాయి. ఇప్పుడూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయని తెలిపాయి…