వైద్య విద్యార్థిని ప్రీతి మృతి…. ఆమె మృతి నన్నెంతగానో బాధించింది.. మంత్రి హరీశ్ రావు…

*సీనియర్ వేధింపులు తాళలేక హానికర ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడి గత నాలుగు రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందింది.

నిమ్స్​లో చికిత్స పొందుతూ ఇవాళ రాత్రి ప్రాణాలు విడిచింది. ఎలాగైనా దేవుడి దయతో బ్రతికి వస్తుందని కోటి ఆశలతో ఎదురుచూసిన తల్లిదండ్రులకు కన్నీటి శోకమే మిగిలింది. ప్రీతి మరణంతో విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రీతి మరణంపై మంత్రి హరీశ్​రావు స్పందించారు.

ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తమ కుమార్తె ఇకలేరని తెలుసుకున్న తల్లిదండ్రులు (Preethi Parents) కన్నీరుమున్నీరవుతున్నారు. తోటి స్నేహితురాలు చనిపోవడంతో కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థినులు (College Students) శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామం. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో (MGM) విధులు నిర్వహిస్తుండేది. ప్రీతి తండ్రి నరేందర్ రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ASI గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని బోడుప్పల్ వెస్ట్ బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. విధుల్లో భాగంగా హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్లి వస్తున్నారు. రవీంద్ర మూడో కుమార్తె ప్రీతి.

సీనియర్ మెడికో సైఫ్ వేధింపులతో విసిగిపోయిన ప్రీతి విషపు తనకు తానుగా ఇంజక్షన్ తీసుకుంది. దీంతో ఆ విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు హుటాహుటిన వరంగల్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎం తరలించగా అంతకంతకూ ప్రీతి ఆరోగ్యం విషమించింది. దీంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. వరంగల్ (Warangal) నుంచి హైదరాబాద్‌ (Hyderabad) నిమ్స్‌‌ ఆస్పత్రికి తరలించే సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్‌ (CPR) చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా వైద్యులు చేశారు. నిమ్స్‌కు చేరుకున్న అనంతరం ప్రీతికి పూర్తిగా వెంటీలేటర్‌, ఎక్మోపైనే చికిత్స అందించారు. అయితే.. హానికర ఇంజక్షన్ తీసుకోవడం వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల బ్రెయిన్‌ (Brain)పై ప్రభావం ఎక్కువగా పడుతుందని డాక్టర్లు చెప్పారు. శ్వాస తీసుకోవడంలోనూ ప్రీతి బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో న్యూరాలజీ, జనరల్‌ ఫిజీషియన్‌, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షించింది. ప్రీతిని రక్షించేందుకు నిమ్స్‌ వైద్యులు అన్ని ప్రయత్నాలూ చేశారు. అయితే.. ఐదురోజులుగా ప్రీతిని కాపాడాలని ప్రత్యేక బృందం శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది…

మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి (Doctor Preethi) తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించిందని మంత్రి చెప్పారు. పూర్తి అరోగ్య వంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తన మనసును తీవ్రంగా కలిచి వేసిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు…