దోసకాయల దొంగ నక్క…

*దోసకాయల దొంగ నక్క
(సరదా జానపద కథ).
     ఒకూర్లో ఒక రైతున్నాడు. ఆయన పొలంలో దోసకాయ విత్తనాలు వేసినాడు. వానలు బాగా పడడంతో కొన్ని రోజుల్లోనే తోటలో దోసకాయలు బాగా కాసినాయి. అది చూసి రైతు ఎంతో సంబరపడినాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబల్లేదు.
ఆ ఊరిని ఆనుకుని ఒక పెద్ద అడవి వుంది. ఆ అడవిలో ఒక నక్కుంది. దానికి దోసకాయలంటే చానా ఇష్టం. రోజూ రాత్రి చీకటి పడగానే దొంగచాటుగా తోటలోనికి పోయి మంచి మంచి దోసకాయల్ని కడుపు నిండా తిని, తన పెండ్లాం, బిడ్డల కోసం మిగతావన్నీ కోసుకోని ఒక సంచి నిండా వేసుకోని వెళ్ళిపోయేది.
పొద్దున్నే రైతు వచ్చి చూస్తే ఇంకేముంది. తోటలో ఒక్క దోసకాయ గూడా కనబడేది కాదు. ప్రతిరోజూ అంతే… కాసిన కాయలు కాసినట్టు నక్క ఎత్తుకోని పోయేది. దాంతో రైతు కట్టె తీసుకోని రాత్రిపూట చేనుకి కాపలా కాయడం మొదలు పెట్టినాడు. కానీ పాపం ఎంతసేపని మేలుకోగలడు. ఏదో ఒక సమయంలో నిద్ర వచ్చి కళ్ళు మూసుకొని పోతాయి గదా. అంతే… అందుకోసమే ఎదురుచూస్తా వున్న ఆ దొంగనక్క ఠక్కున లోపలికి దూకి రైతు మళ్ళా కళ్ళు తెరిచేసరికి కాయలన్నీ మాయం చేసేది.
ఇక ఇట్లాగైతే లాభం లేదనుకున్న రైతు బాగా ఆలోచించి చివరకు చిన్న చిన్న కత్తులు తీసుకోనొచ్చి, దోసకాయల చుట్టూ పెట్టి అవి కనబడకుండా ఎండుగడ్డి కప్పినాడు. మామూలుగానే ఆరోజు రాత్రిగూడా నక్క హుషారుగా ఈల వేసుకుంటా తోటకాడికి వచ్చింది. చూస్తే రైతు యాడా కనబడలేదు. ఈరోజు రైతు ఇంకా రాలేదేమో…వచ్చేలోగా అన్నీ తినేయాలనుకోని ఎగిరి తోటలోనికి దుంకింది. అంతే… కత్తులు సర్రున లోపలికి దిగబడినాయి. పాపం నక్క బాధతో విలవిలలాడిపోతా కుయ్మో…. మొర్రో…. అని ఏడుస్తా బెరబెరా తోట దాటి అడవిలోనికి ఉరికింది. దానికి కత్తులు గుచ్చుకున్నాయి గదా.. ఒళ్ళంతా ఒగటే రక్తం కారిపోసాగింది. నడవలేక… నడవలేక నడవసాగింది. అట్లా కొంతదూరం పోగానే దానికి బాగా నీరసమొచ్చి ఒక బండ మీద కూలబడి అట్లాగే నిద్రపోయింది.
రక్తం ఎట్లుంటాది. ఎర్రగా… బంక బంకగా వుంటాది గదా. నక్క బండ మీద పడుకున్న కాసేపటికి రక్తం బాగా ఎండిపోయి దాని కడుపు బండకు అట్లనే అతుక్కోనిపోయింది. పొద్దున్నే నక్కకు మెలకువ వచ్చి లేద్దామంటే… ఇంకేముంది… అతుక్కోనిపోయింది గదా. లేవలేక పోయింది. ఎంత గింజుకులాడినా లాభం లేకపోయింది.
దాంతో ఇక లాభం లేదనుకోని ఆ నక్క కళ్ళనీళ్ళు పెట్టుకోని వానదేవున్ని తలచుకుంటా “భగవంతుడా… బుద్ధి గడ్డి తిని మంది సొమ్ముకు ఆశ పడినాను. ఇంకెప్పుడూ దొంగతనం చేయను. ఈ ఒక్కసారికి నన్ను కాపాడినావంటే ఏడు రాత్రులు మేలుకొని నీకు భజన చేస్తాను” అని మొక్కుకోనింది. అది విన్న వానదేవుడు సరేనని పెద్ద వాన కురిపించినాడు. నీళ్ళు బాగా తగిలీ తగిలీ రక్తమంతా కరిగిపోయింది. దాంతో ఆ నక్క బైటపడి బతుకుజీవుడా అనుకుంటా పరుగెత్తుకొని ఇంటికి చేరుకోనింది.
పెండ్లాం బిడ్డలకు జరిగిందంతా చెప్పి మొక్కు తీర్చుకోకుంటే దేవునికి కోపమొస్తాది, ఎట్లాగైనా మొక్కు తీర్చుకోవాల అనింది. పెండ్లాం
బిడ్డలు కూడా సరే అన్నాయి. కానీ భజన చేయాలంటే తాళాలు కావాలి గదా. తాళాలంటే ఇంటికి వేసేవి కాదు. దేవుని దగ్గర ఒకడు పాడుతావుంటే పక్కనే కూర్చోని ఇంకొకడు పాటకు తగ్గట్లు రెండు చేతుల్తోనూ పట్టుకొని టప్… టప్.. అని కొడతావుంటాడు చూడు అవి. ఆ తాళాలు దాన్ల దగ్గర లేవు. చుట్టుపక్కల ఎవరిని అడిగినా మా దగ్గర లేవంటే మా దగ్గర లేవన్నారు. మరి ఎట్టాగబ్బా అని ఆలోచించీ… ఆలోచించీ… చివరకు ఒక ఉపాయం పన్నినాయి.
అడవిలో నక్క నక్క పెండ్లాం దారి పక్కన ఒక పొదలమాటున కూచోని వచ్చే పోయే జనాలను బాగా గమనించసాగినాయి. కాసేపటికి ఒకడు పక్క ఊరిలో భజన చేసి తాళాలు పట్టుకోని వస్తా కనబన్నాడు. వెంటనే ఒక నక్క దారిలో వానికి కనబడేటట్లుగా ఒకచోట చచ్చిందానీ మాదిరి పడిపోయింది. వాడు వస్తా వస్తా ఆ నక్కను చూచి “ఇదేదో ఇప్పుడే చచ్చినట్లుంది. వెంటనే తీస్కోని పోయి నేనూ, నా పెండ్లాం బిడ్డలు బాగా కూర వండుకోని తినొచ్చు” అనుకోని లొట్టలేసుకుంటా తాళాలు కింద పెట్టి దాని దగ్గరకు పోయినాడు.
వాడు తాళాలు కింద పెట్టి అట్లా వెళ్ళడం ఆలస్యం నక్క పెండ్లాం వెనుకనుండి ఎగిరి దుంకి దాన్లను నోట కరచుకోని “వూ” అంటూ ఈల వేస్తా పారిపోయింది. ఆ అరుపు వినబడగానే అంతవరకూ చచ్చిందానిలెక్క గమ్మున పడున్న నక్క ఛటుక్కున పైకి లేచి పారిపోయింది. వాడు ఆచ్చర్యపోయి తిరిగి చూస్తే ఇంగేముంది. తాళాలు గూడా లేవు. దాంతో వాడు లబోదిబోమని ఏడుస్తా ఇంటికి వెళ్ళిపోయినాడు.
నక్క నక్క పెండ్లాం దేవునికి మొక్కుకున్నట్లుగా గుడికి పోయి వరుసగా ఏడు రాత్రులు భజన చేసి, తమ మొక్కును చెల్లించుకున్నాయి. ఆ తరువాత తాళాలు తీసుకొని పోయి మరలా వాటి యజమాని గుమ్మం ముందు పెట్టి, తలుపు టకటకా కొట్టి వచ్చేశాయి.
*****************************