5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నాగార్జునసాగర్, తిరుపతి ఉప ఎన్నికలకు నోటిఫికెషన్…

*ఐదు రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు.*

* 16 రాష్ట్రాల్లోని 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.

* ఈ సారి ఎన్నికలకు ఆన్‌లైన్ నామినేషన్లకు అవకాశం.

* ఇంటింటి ఎన్నికల ప్రచారానికి ఐదుగురికే అనుమతి-సీఈసీ

* పోలింగ్ సిబ్బంది మొత్తానికి వ్యాక్సినేషన్..

* వ్యాక్సిన్ తీసుకున్నవారినే ఎన్నికల సిబ్బందిగా నియమిస్తాం-సీఈసీ

* 80 ఏళ్లు పైబడిన వృద్ధులు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవచ్చు-సీఈసీ

* ఐదు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడు… మే2న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు-సీఈసీ

*కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6న ఎన్నికల పోలింగ్*

* అసోంలో మూడు దశల్లో పోలింగ్..

* మార్చి 27న తొలి విడత.. ఏప్రిల్ 1న రెండో విడత, ఏప్రిల్ 6న మూడో విడత పోలింగ్.

*పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో ఎన్నికల పోలింగ్.*

* మార్చి 27 తొలి విడత, ఏప్రిల్ 1న రెండో విడత, ఏప్రిల్ 6న మూడో విడత, ఏప్రిల్ 10న నాల్గో విడత,

* ఏప్రిల్ 17న ఐదో విడత, ఏప్రిల్ 22న ఆరో విడత, ఏప్రిల్ 26న ఏడో విడత, ఏప్రిల్ 29న ఎనిమిదో విడత పోలింగ్.

*అన్ని రాష్ట్రాల్లో మే-2న కౌంటింగ్*

*5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నాగార్జునసాగర్, తిరుపతి ఉప ఎన్నికలకు నోటిఫికెషన్*

ఐదు రాష్ట్రాల్లో కాలపరిమితి ముగుస్తున్న శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్‌ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు సీఈసీ సునీల్ అరోరా కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో షెడ్యూల్‌ విడుదల చేశారు. అలాగే ఏపీలోని తిరుపతి లోక్‌సభ సీటుకూ, తెలంగాణలోని నాగార్జునసాగర్‌ అసెంబ్లీ సీటు ఉపఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది.

అస్సోంలో మూడు దశలుగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అసోంలో తొలిదశ ఎన్నికలకు మార్చి 2న నోటిఫికేషన్‌ వెలువడనుంది. 47 సీట్లకు జరిగే ఈ ఎన్నికలకు మార్చి 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. రెండో దశలో భాగంగా జరిగే 39 సీట్లకు జరిగే ఎన్నికలకు ఏప్రిల్ 1న పోలింగ్‌ ఉంటుందని సీఈసీ అరోరా తెలిపారు. మూడోదశలో భాగంగా 40 సీట్లకు జరిగే ఎన్నికలకు ఏప్రిల్‌ 6న పోలింగ్‌ నిర్వహిస్తారు. అసోంలో మూడుదశల కౌంటింగ్‌ మే 2న ఉంటుంది. కేరళలో అన్ని సీట్లకూ ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 6న కేరళ శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నారు. తమిళనాడులో 234 సీట్లకూ ఒకేదశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 6న ఉంటుందని సీఈసీ తెలిపారు. కన్యాకుమారి ఎంపీ సీటు ఉపఎన్నిక కూడా దీంతో కలిపి నిర్వహిస్తారు. పుదుచ్చేరిలోని రెండు జిల్లాలలో ఉన్న 30 సీట్లకూ ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏప్రిల్‌ 6న పోలింగ్‌ నిర్వహించనున్నారు. పశ్చిమబెంగాల్లో 294 స్ధానాలకు 8 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. పశ్చిమబెంగాల్లో మార్చి 27, ఏప్రిల్‌ 1, ఏప్రిల్‌ 3, ఏప్రిల్‌ 10, ఏప్రిల్‌ 17, ఏప్రిల్‌ 22, ఏప్రిల్‌ 26, ఏప్రిల్‌ 29న 8 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్‌ ఒకేసారి మే 2న నిర్వహిస్తారు.

నామినేషన్లు సమర్పించేందుకు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. ఇంటింటికి ప్రచారాన్ని కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. రోడ్‌షోలు, బహిరంగసభలు కూడా కోవిడ్‌ నిబంధనల ఆధారంగా మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. పోలింగ్‌ సమయాన్ని కరోనా బాధితుల కోసం మరో గంటసేపు పెంచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకే ముగియాల్సిన పోలింగ్‌ను కరోనా బాధితుల కోసం చివరి గంట కేటాయిస్తూ ఆరు గంటల వరకూ పెంచారు.

పశ్చిమబెంగాల్‌ శాసనసభలోని 294 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే తమిళనాడు అసెంబ్లీలోని 234 అసెంబ్లీ సీట్లకూ, కేరళ శాసనసభలోని 140 సీట్లకూ, అస్సోం అసెంబ్లీలో 126 సీట్లకూ, పుదుచ్చేరి శాసనసభలో 30 సీట్లకూ ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని సీఈసీ సునీల్‌ అరోరా ప్రకటించారు.

పశ్ఛిమబెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్‌ సర్కారు కొనసాగుతుండగా, తమిళనాడులో పళని స్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే సర్కారు కొలువై ఉంది. అలాగే కేరళలో పినరయ్‌ విజయన్‌ నేతృత్వంలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుండగా.. అస్సోంలో శర్భానంద్‌ సోనేవాల్‌ నేతృత్వంలోని బీజేపీ సర్కారు, పుదుచ్చేరిలో నారాయణ సామి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. తాజాగా పుదుచ్చేరి బలపరీక్షలో సీఎం నారాయణస్వామి మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో రాష్ట్రపతి పాలన విధించారు.