ప్రపంచంలోనే అతి చిన్న పిల్లి అయిన కుంచుక పిల్లి.. మెదక్ జిల్లాలో ప్రత్యక్షం..!!

మెదక్ జిల్లాలోనీ పోచారం లొ అభయారణ్యాల్లో ప్రపంచంలోనే అతి చిన్న పిల్లి అయిన కుంచుతోక పిల్లి(నామాల పిల్లి)ని గుర్తించారు. దీని కోసం స్థానిక హవేలి ఘణపూర్ మండల పరిధిలోని 40 గ్రామాల్లో వీటి సంరక్షణ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ(ఏడబ్ల్యూసీఎస్) 15 కెమెరాలు ఏర్పాటు చేసి, సుమారు నాలుగు నెలల పాటు కష్టపడి ప్రతి రోజు కెమెరా స్థానాలను మార్చుకుంటూపోయారు..చివరికి బ్యాతొల్ అనే గ్రామ పరిసరాల్లో ఈ పిల్లి కెమెరా కంటికి చిక్కింది. ఈ పిల్లి జాతి మనుగడ రోజురోజుకూ తగ్గిపోతుంది. ఇది ఎక్కువగా చెట్లపైన నివసిస్తూ ఉంటుంది.

అయితే ఈ పిల్లి వల్ల రైతులకు ఎక్కువ లాభం ఉంటుందంటున్నారు వైల్డ్ లైఫ్ హెడ్ అమర్నాథ్ జక్కా. ఈ కుంచుతోక పిల్లి(నామాల పిల్లి) ఎక్కువగా ఎలుకలు, పాములు, బల్లులు, పురుగులను తింటుంది. పంట పొలాల వద్ద ఎలుకల బెడద వల్ల చాలా మంది రైతులు పంటను నష్టపోతారు. అలాంటి ప్రాంతంలో ఈ పిల్లి ఉంటే రైతులకు ఎంతో లాభం. ఆవాసాలను కోల్పోవడం వల్ల, భారతదేశంలో ఈ అడవి జాతికి చెందిన కుంచుతోక పిల్లుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ పిల్లి భారత్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. సంరక్షణ పనుల్లో భాగంగా చిన్న పిల్లిని సంరక్షించాల్సిన ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తే మంచిదంటున్నారు వైల్డ్ లైఫ్ సిబ్బంది.