భయపెట్టే ఆ శబ్ధాలకు చెందిన ఓ ఆడియోను యురోపియన్ స్పేస్ ఏజెన్సీ తాజాగా రిలీజ్ చేసింది. 5 నిమిషాలు ఉన్న ఆ ఆడియో.. భూ అయస్కాంత క్షేత్రంలోని ధ్వని తరంగాలను వినిపిస్తోంది. భూ అయస్కాంత క్షేత్రంలోని తరంగాలు ధ్వనిగా మారితే ఎలా ఉంటుందో ఆ ఆడియోలో తెలుసుకోవచ్చు. భూగర్భంలోని మాగ్నెటోస్పియర్ నుంచి వస్తున్న ఆ తరంగాలు ఒక రకంగా ఈ భూగోళాన్ని సూర్యుడి రేడియేషన్ నుంచి రక్షిస్తున్నాయి.టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్‌కు చెందిన పరిశోధకులు మ్యాగ్నటిక్ సిగ్నల్స్‌ను స్టడీ చేశారు. స్వార్మ్ శాటిలైట్ మిషన్ ద్వారా ఆ అయస్కాంత తరంగాలను పరిశీలిస్తున్నారు. అయస్కాంత క్షేత్రం నుంచి రిలీజ్ అవుతున్న తరంగాలను ధ్వనిగా మారుస్తోంది స్వార్మ్ శాటిలైట్.
యురోపియన్ స్పేస్ ఏజెన్సీ రిలీజ్ చేసిన ఆడియోలోని శబ్ధాలు వింటే ఓ వింత అనుభూతికి లోనవుతాం. పగుళ్ల నుంచి శబ్ధం వస్తున్నట్లుగా ఆ ధ్వనులు ఉన్నాయి. లోతుగా శ్వాసను తీసుకుంటున్న సమయంలో వచ్చే శబ్ధాల తరహాలో భూ అయస్కాంత క్షేత్రం నుంచి ధ్వనులు వస్తున్నట్లు చెప్పారు.
డెన్మార్క్‌లోని కోపెన్‌హెగన్‌లో ఉన్న సోల్‌బెర్గ్ స్క్వేర్‌లోని లౌడ్ స్పీకర్లతో అక్టోబర్ 24వ తేదీన ఆ ధ్వనులను మూడుసార్లు రికార్డు చేశారు.