బోయిగూడ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన..
హైదరాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు…మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి సహాయ నిధి(PMNRF) నుంచి ఒక్కొక్కరికి 2 లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించారు. ” హైదరాబాద్ (Hyderabad) లోని బోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మరణించిన వారి బంధువులకు అందజేస్తాం ” అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు…
బోయగూడ భారీ అగ్నిప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం..
సికింద్రాబాద్లోని బోయగూడ భారీ అగ్నిప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది మృతిచెందడం అత్యంత బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు రేవంత్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని.. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని రేవంత్రెడ్డి కోరారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు…
బోయగూడలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం..
సికింద్రాబాద్ బోయగూడలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో 11 మంది వలస కార్మికుల సజీవ దహనం బాధాకరమని.. వారి మృతి తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఉపాధి కోసం బిహార్ నుంచి వలస వచ్చిన కూలీలు మృతిచెందడం దురదృష్టకరమన్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: బండి సంజయ్..
బోయగూడ అగ్నిప్రమాదంలో 11 మంది సజీవ దహనం కావడం తనను కలచివేసిందని భాజపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పొట్టకూటి కోసం బిహార్ నుంచి వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. అనుమతుల నుంచి సేఫ్టీ చర్యల దాకా అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం.. పర్యవేక్షణాలోపమే ఇలాంటి ప్రమాదాలకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు…