యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్లో మంటలు…
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా రెండు బోగీల్లో మంటలు చెలరేగి దట్టంగా పొగలు అలముకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేసి.. రెండు బోగీల్లోని ప్రయాణికులను దించేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. మంటల ధాటికి రెండు బోగీలు దగ్ధమైనట్లు సమాచారం.అయితే మంటలు క్రమంగా మిగతా బోగీలకు విస్తరిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.