సరదాగా నవ్వుకోండి కాసేపు…

*సరదాగా నవ్వుకోండి కాసేపు…*
======================

*ఆఫీసర్:* బామ్మగారూ… నేను జనాభా లెక్కల సేకరణకు వచ్చిన అధికారిని. దయచేసి మీ ఇంట్లో వాళ్ళని పిలవండి…

*బామ్మ:* ఏమిరా భడవా నేను మనిషిని కానా? నన్ను పని మనిషి అనుకొంటున్నావా? లేక ఇంకేమనుకుంటున్నావో చెప్పురా త్రాష్టుడా?

*ఆఫీసర్:* అయ్యో బామ్మగారూ నన్ను క్షమించండి. ఈ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు?

*బామ్మ:* ఒక డజన్ మంది…

*ఆఫీసర్:* డజనా? ఓహో పన్నెండు మందా! సరే, పెద్దాయన ఏంచేస్తుంటారు?

*బామ్మ:* జైలు కెళ్ళాడు…

*ఆఫీసర్:* జైలు కెళ్ళారా? ఏం నేరం చేసారు? ఎన్నేళ్ళు శిక్ష పడింది? కఠిన శిక్షా లేక సాధారణ శిక్షా?

*బామ్మ:* నీ మెుహం మండా… ఆయన జైలు అధికారి…

*ఆఫీసర్:* ఓహో ! అలానా ! ఆయనకు ఎంతమంది పిల్లలు?

*బామ్మ:* ఓక పోతు, రెండు పెట్టలు…

*ఆఫీసర్:* పోతు, పెట్ట ఏంటండీ?

*బామ్మ:* వెధవా! అదికూడా తెలియకుండా ఎలా ఆఫీసరు అయ్యావు? ఆఫ్రాచ్రుడా !
ఒక మగ, ఇద్దరు ఆడ…

*ఆఫీసర్:* అబ్బాయి ఏం చేస్తుంటాడు?

*బామ్మ:* కొంపలార్పుతూ ఉంటాడు…

*ఆఫీసర్:* అదేం పనండీ ! మీరైనా చెప్పలేక పోయారా?

*బామ్మ:* నువ్వు పరీక్ష పాసయ్యేవా? దొడ్డిదారిన అధికారి అయ్యావా ! బడుద్దాయ్? వాడు ఫైర్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నాడురా అరకాణీ వెధవా !

*ఆఫీసర్:* బామ్మ గారు… మీరు సరిగ్గా చెప్పండి. ఇలా డొంకతిరుగుడు నాకర్థంకాదండీ…

*బామ్మ:* ఈ మాత్రం తెలియని వాడివి నువ్వేం ఆఫీసరువిరా? పింజారీ వెధవ !

*ఆఫీసర్:* బామ్మ గారూ! మరి ఆడపిల్లలు ఏం చేస్తారో సూటిగా చెప్పండి దయచేసి…

*బామ్మ:* ఒకత్తేమో ఊడబెరుకుతూ ఉంటుంది. ఇంకోకత్తేమో తైతక్కలాడుతూ ఉంటుంది…

*ఆఫీసర్:* బామ్మగారూ ఊడబెరకడం, తైతక్కలాడడం ఏమిటండీ?

*బామ్మ:* ఒకతి పళ్ళ డాక్టర్, ఇంకోతి భరతనాట్యం మాస్టర్ రా నెలతక్కువ వెధవా!

*ఆఫీసర్ స్ప్రుహ కోల్పోయాడు…*

*బామ్మ:* అయ్యో పాపం స్ప్రుహ తప్పేట్టున్నావే ! ఇలా కూర్చుని తగలడు… ఇంత చద్దన్నం, రవ్వంత ఆవకాయ పెడతాను. తిని అఘోరించు…