ప్రపంచ ప్రతినిధులు రాకతో భారత్ మండపం వద్ద సందడి..అతిథులకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ..

దేశరాజధాని ఢిల్లీలో (Delhi) ప్రతిష్టాత్మకమైన జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) ప్రారంభమయింది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సు అట్టహాసంగా జరుగుతోంది. సభ్యదేశాల అధిపతులు, ప్రపంచ ప్రతినిధులు రాకతో భారత్ మండపం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఉదయం 9.20 నుంచి 10.20 మధ్యలో అతిథులు ఒక్కొక్కరిగా మండపానికి చేరుకున్నారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi).. భారత్ మండపానికి చేరుకున్నారు. ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత మండపానికి వచ్చిన అతిథులకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు.

సదస్సు ప్రారంభమయ్యాక ప్రధాని మోడీ మొరాకో భూకంపంలో మృతులకు సంతాపం తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అలాగే భూకంపం మిగిల్చిన నష్టం నుంచి మొరాకో త్వరగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు మోడీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జీ20 లోకి ఆఫ్రికన్ యూనియన్‌కు మోడీ స్వాగతం పలికారు. ఇది ఆఫ్రికెన్ యూనియన్‌కు చారిత్రక ఘట్టమని మోడీ పేర్కొన్నారు.

అనంతరం మోడీ ప్రసంగిస్తూ.. ప్రపంచ దేశాల మధ్య విశ్వాసాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో విశ్వాసం అనే అంశంలో లోటు కనిపిస్తోందని చెప్పారు. ఈలోటును తొలగించి.. నమ్మకాన్ని పెంచాలని వ్యాఖ్యానించారు. కరోనా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన లోటును నమ్మకంతో భర్తీ చేయాలని సూచించారు. ప్రపంచం మంచిగా ఉండాలంటే.. అన్ని దేశాలు కలిసికట్టుగా నడవాలని పేర్కొన్నారు. సబ్‌కా సాత్.. సబ్‌కా విశ్వాస్.. సబ్‌కా ప్రయాస్ మంత్రంతో అందరం ముందుకు వెళ్లాలని మోడీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ముందున్న సవాళ్లు.. సమస్యలను భావి తరాల కోసం పరిష్కరించుకోవాలని మోడీ వెల్లడించారు.