గాజాలోని కీలక ప్రాంతాలను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ సైన్యం..

గాజా ఆస్పత్రులను ఇజ్రాయెల్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో వైద్యసేవలన్నీ స్తంభించాయి. ఫలితంగా రోగులు అల్లాడుతున్నారు.తాజా అప్‌డేట్ ఏమిటంటే.. గాజాలోని నాలుగు ఆస్పత్రులను ఇజ్రాయెల్ ఆర్మీ యుద్ధ ట్యాంకులు చుట్టుముట్టాయి. వీటిలో పిల్లలకు చికిత్స అందించే ఒక ఆస్పత్రి కూడా ఉండటం గమనార్హం. ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టిన వైద్య సంస్థల జాబితాలో అల్-రాంటిసి హాస్పిటల్, అల్-నసర్ హాస్పిటల్, గవర్నమెంట్ ఐస్ హాస్పిటల్, మెంటల్ హెల్త్ హాస్పిటల్ ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం బెదిరింపులకు పాల్పడి.. ఈ ఆస్పత్రుల నుంచి రోగులను, వైద్యులను, ఆరోగ్య సిబ్బందిని బయటికి పంపిస్తోందని గాజా ఆరోగ్య శాఖ ఆరోపించింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలోని 35 ఆసుపత్రులకుగానూ 18 ఆసుపత్రుల్లో ఇంధనం పూర్తిగా అయిపోయిందని తెలిపింది. ఇక జనరేటర్‌పై కూడా ఆ ఆస్పత్రులు పనిచేసే అవకాశం లేదని వెల్లడించింది. మరోవైపు దీనిపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ వాదన మరోలా ఉంది. గాజాలోని ఆసుపత్రుల నుంచి హమాస్ మిలిటెంట్లు తమపైకి కాల్పులు జరుపుతున్నారని ఐడీఎఫ్ ఆరోపిస్తోంది. హమాస్ ఉగ్రవాదులు ఆసుపత్రులపై నుంచి కాల్పులు జరుపుతుంటే.. తాము చూస్తూ కూర్చోలేమని అంటోంది.ఉత్తర గాజాలోని అల్ నసర్ ఆసుపత్రి, అల్ రాంటిసి పీడియాట్రిక్ ఆసుపత్రి అధిపతి ముస్తఫా అల్-కహ్లౌట్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ”ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మా ఆస్పత్రులను చుట్టుముట్టాయి. మా ఆస్పత్రుల నుంచి వైద్యులు, రోగుల తరలింపులో రెడ్ క్రాస్ మాకు సహాయం అందించాలి. ఏదిఏమైనా రోగుల సంక్షేమమే మాకు ముఖ్యం” అని కోరారు. ”మా ఆస్పత్రికి ఇప్పుడు విద్యుత్ లేదు.. రోగులకు చికిత్స చేసేందుకు ఆక్సిజన్ అందుబాటులో లేదు.. మందులు, నీరు కూడా అందుబాటులో లేవు” అని అల్-కహ్లౌట్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తు ఏమిటో తమకే తెలియడం లేదన్నారు. మరోవైపు శుక్రవారం రాత్రి కూడా అల్-షిఫా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. ఈవివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతినిధి మార్గరెట్ హారిస్ ధ్రువీకరించారు. ఇజ్రాయెల్ మాత్రం.. అల్-షిఫా ఆసుపత్రిపై తాము బాంబులు వేయలేదని తెలిపింది. గాజా లోపలి నుంచి ఎవరో మిస్ ఫైర్ చేసిన రాకెట్ ఆస్పత్రిపై పడి ఉండొచ్చని(Gaza Hospitals) స్పష్టం చేసింది.