ఆహారం కోసం వేచి చూస్తున్న వారిపై కాల్పులు..29 మంది ప్రాణాలు కోల్పోగా..సుమారుగా 150 మందికిపైగా గాయాలు…!

| ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం (Israel – Hamas War)తో పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌ (Gaza Strip)లో విధ్వంసం నెలకొంది. ఓ వైపు పౌరుల మరణాలు, మరోవైపు ఆకలి కేకలతో గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడి ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. యుద్ధానికి కేంద్రంగా మారిన ఈ ప్రాంతంలో తాజాగా ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆహారం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ సైనికులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల ఘటనలో సుమారు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Gaza health ministry) తెలిపింది..చాలా మంది పౌరులు ఆహారం కోసం ఉత్తర గాజా రౌండ్‌అబౌట్ వద్ద ట్రక్కు కోసం వేచి ఉన్నట్లు తెలిపింది. ఆ సమయంలో ఇజ్రాయెల్‌ దళాలు ఒక్కసారిగా కాల్పులకు (Israeli gunfire) పాల్పడినట్లు పేర్కొంది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారుగా 150 మందికిపైగా గాయాలపాలైనట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పేర్కొంది.

మరోవైపు ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆసుపత్రికి వస్తున్న క్షతగాత్రులను పర్యవేక్షించడం సాధ్యం కావడం లేదని.. సరైన వసతులు, ఔషధాలు లేవని వెల్లడించింది. గాజా ఉత్తర భాగంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో వేలాది మంది సామాన్య పౌరులు మానవతా సాయం కోసం వేచిచూస్తున్నారని తెలిపింది. అలాంటి వారిని ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించింది.

యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన గాజా ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు మానవతా సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. రోడ్డు, వాయు, సముద్రం మార్గాల ద్వారా ఆహారాన్ని అందజేస్తున్నాయి. మరోవైపు దాదాపు 200 టన్నుల ఆహార పదార్థాలతో సిప్రస్‌ నుంచి ఓ భారీ నౌక గాజాకు బయల్దేరింది.