దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పూర్వ స్థితికి చేరుకుని వృద్ధి బాటలో పరుగులు….

దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పూర్వ స్థితికి చేరుకుని వృద్ధి బాటలో పరుగులు తీసేందుకు రెండేండ్ల సమయం పడుతుందని ఆర్థిక సర్వే 2020-21 స్పష్టం చేసింది. ఈ మహమ్మారి ధాటికి వ్యవసాయం మినహా అన్ని రంగాలు కుదేలయ్యాయని తెలిపింది. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటులో 7.7 శాతం క్షీణత నమోదుకావచ్చని అంచనా వేసింది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ‘వీ’ ఆకారంలో కోలుకుంటున్నదని, దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 11 శాతానికి పుంజుకుంటుందని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు రికార్డు స్థాయిలో 7.7 శాతం క్షీణిస్తుందని ఆర్థిక సర్వే-2020-21 పేర్కొన్నది. కరోనా లాక్‌డౌన్‌ ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. రానున్న రెండేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో పరుగులు తీస్తుందని, తద్వారా అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కొవిడ్‌-19 సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ‘వీ’ ఆకారంలో కోలుకుంటున్నదని తెలిపింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో జీడీపీ 11 శాతానికి పుంజుకుని రెండంకెల వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేసింది. 1979-80లో దేశ ఆర్థిక వ్యవస్థ మైనస్‌ 5.2 శాతానికి క్షీణించిందని, ఇప్పటి వరకు ఇదే భారీ క్షీణత అని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులను ప్రతిబింబించే ఈ సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దీనిని డిజిటల్‌ మాధ్యమంలో కూడా విడుదల చేశారు. దీర్ఘ కాలంలో దేశ ఉత్పాదక సామర్థ్యానికి నష్టం వాటిల్లకుండా నిరోధించేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టిన ఏకైక దేశం భారత్‌ మాత్రమేనని సర్వే కొనియాడింది. ప్రస్తుతం కొవిడ్‌-19 వ్యాక్సిన్లు క్రమంగా అందుబాటులోకి వస్తుండటంతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, వీటితోపాటు సరఫరా రంగానికి, మౌలిక వసతులకు సబందించిన పెట్టుబడులకు ఊతమివ్వడం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, సేవా రంగంలో డిమాండ్‌ పుంజుకోవడం, వడ్డీ రేట్లను తగ్గించడం, రుణాల పంపిణీ ఊపందుకోవడం లాంటి అంశాలు జీడీపీకి మరింత ఊతమిస్తాయని వివరించింది. ఈ సర్వేను కొవిడ్‌-19 పోరాట యోధులకు అంకితమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ తెలిపారు. అనంతరం ఆయన ఆర్థిక సర్వేకి సంబంధించిన ప్రత్యేక యాప్‌ను విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే మళ్లీ కోలుకుంటుందని, కానీ ప్రజలు ప్రాణాలను కోల్పోతే ఎప్పటికీ తిరిగి తీసుకురాలేమని అన్నారు. ఈ ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిందని చెప్పారు. తద్వారా దేశంలో దాదాపు 37 లక్షల కొవిడ్‌-19 కేసులను తగ్గించడంతోపాటు లక్ష మంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు.
2019-20లో వృద్ధి 4 శాతమే
గడిచిన ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధిరేటును మరింత తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. 2019-20లో వృద్ధి 4 శాతానికి పరిమితం చేసింది. గతంలో 4.2 శాతంగా ఉంటుందని వెల్లడించింది. 2011-12 గణాంకాల ప్రకారం 2019-20లో రూ.145.69 లక్షల కోట్లు కాగా, 2018-19లో రూ.140.03 లక్షల కోట్లుగా ఉన్నట్లు జాతీయ గణాంకాల శాఖ తాజాగా వెల్లడించింది. 2018-19లో జీడీపీలో 6.5 శాతం వృద్ధి నమోదైంది. గనులు, తయారీ, విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సర్వీసులు తక్కువ వృద్ధిని నమోదు చేసుకోవడం వల్లనే వృద్ధి అంచనాను సవరించినట్లు తెలిపింది. అలాగే నామినల్‌ నెట్‌ నేషనల్‌ ఇన్‌కం(ఎన్‌ఎన్‌ఐ) 2019-20లో రూ.179.94 లక్షల కోట్లు ఉండగా, అంతక్రితం ఏడాది రూ.167.05 లక్షల కోట్లుగా ఉన్నది. మరోవైపు, 2019-20లో భారతీయుల తలసరి ఆదాయంరూ.1,34,186గా నమోదైంది. అంతక్రితం ఇది రూ.1,25,883గా ఉన్నది.
పట్టాలెక్కిన రియల్‌ ఎస్టేట్‌
కరోనా వైరస్‌ నేపథ్యంలో తీవ్రంగా ప్రభావితమైన దేశీయ నిర్మాణ రంగం.. తిరిగి కోలుకుంటున్నదని ఆర్థిక సర్వే వెల్లడించింది. గతేడాది ఏప్రిల్‌-జూన్‌లో రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు, లావాదేవీలు స్తంభించిపోయాయని, అయితే జూలై నుంచి సరసమైన ధరల్లో లభించే గృహాలకు డిమాండ్‌ పెరిగిందని చెప్పింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ కింద గతేడాది నిర్మాణ రంగానికి పలు ప్రోత్సాహకాలు దక్కాయన్నది.