నాలుగు వాయిదాల్లో నిర్మాణ రంగ ఫీజు చెల్లించే వెసులుబాటు మార్చి 31 వరకే….

వాయిదా పద్ధతి మార్చి 31 వరకే…
నిర్మాణ రంగ ప్రాజెక్టుల ఫీజును వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు మార్చి 31వ తేదీ వరకే సమయం ఉందని, ఆ తర్వాత మొత్తం ఫీజు ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ విభాగాలు చెబుతున్నాయి. కొవిడ్‌-19 నేపథ్యంలో రియల్‌ వ్యాపారానికి ఊతమిచ్చేలా గత ఆర్థిక సంవత్సరంలో పురపాలక శాఖ నాలుగు వాయిదాల్లో నిర్మాణ రంగ ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించింది. 1000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు, లే అవుట్‌లకు ఈ విధానం వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం రుసుమును నాలుగు భాగాలుగా విభజించి, మొదటి వాయిదా చెల్లించిన తర్వాత అనుమతి ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీలను ఆదేశించారు. మార్చి 2021 వరకు ఈ విధానం అమలులో ఉంటుందని, ఆ లోపు ఒక వాయిదా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపు 35 నుంచి 40 వరకు సంస్థల దరఖాస్తుల పరిశీలన పూర్తయి, ఫీజు చెల్లించాలనే సమాచారం ఇచ్చినా అవి ముందుకు రాలేదు. మార్చి 31లోపు వచ్చి వాయిదాల పద్ధతిని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొదటి వాయిదా ద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.35 కోట్ల నుంచి రూ.50 కోట్లు వచ్చే అవకాశముందని అంచనావేస్తున్నారు. పట్టణ ప్రణాళికా విభాగం ద్వారా ఏటా జీహెచ్‌ఎంసీకి రూ.850 నుంచి రూ.1000 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముంది. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం తగ్గింది. మార్చిలో ఆ లోటు భర్తీ కావచ్చని చెబుతున్నారు.