భారీగా పెరిగిన బంగారం ధరలు…

దేశంలో గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.62 వేల దగ్గర ఉంది. కిందటేడాది ఇదే టైమ్‌లో తులం బంగారం రేటు రూ.54 వేలు పలికింది. గత 12 నెలల్లోనే 10 గ్రాముల గోల్డ్‌ ధర 8 వేలకు పైగా పెరగడంతో సేల్స్‌ తగ్గుతున్నాయని జ్యుయెలర్లు చెబుతున్నారు. ఈసారి అక్షయ తృతీయకు గోల్డ్ జ్యుయెలరీ అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం రేట్లు ఎక్కువగా ఉండడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిందటేడాది అక్షయ తృతీయతో పోలిస్తే ఈసారి బంగారం, డైమండ్ నగల సేల్స్ ఏకంగా 20 శాతం తగ్గుతాయని అంచనావేస్తున్నారు.‘10 గ్రాముల గోల్డ్ ధర రూ.60 వేలకు (ఫ్యూచర్స్‌) పైన ఉండడంతో పసిడి కొనుగోలుపై కన్జూమర్లు వెనకడుగేస్తున్నారు. రేట్లు రికార్డ్‌ లెవెల్‌ నుంచి కొంత తగ్గినా, గోల్డ్ బుల్లిష్‌గా ఉంది. దీని ప్రభావం అక్షయ తృతీయ సేల్స్‌పై పడుతోంది. కిందటేడాదితో పోలిస్తే ఈసారి బంగారు నగల అమ్మకాలు 20 శాతం తగ్గుతాయని అంచనావేస్తున్నాం’ అని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్ జ్యుయెలరీ కౌన్సిల్‌ (జీఐసీ) చైర్మన్ శ్యామ్‌ మెహ్రా పేర్కొన్నారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి హిందువులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ రోజున గోల్డ్‌ కొంటే మంచిదని భావిస్తారు. ఈ పండుగ నాడు జరిగే జ్యుయెలరీ అమ్మకాల్లో 40 శాతం సౌత్‌ ఇండియాలోనే జరుగుతాయని శ్యామ్‌ అన్నారు. 25 శాతం సేల్స్‌ పశ్చిమ భారతంలో, 20 శాతం అమ్మకాలు తూర్పు భారత దేశంలో జరుగుతాయని వివరించారు.