చెస్ ప్రపంచంలో నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్‌కు షాకిచ్చాడు భారత యువ గ్రాండ్‌మాస్టర్…

చెస్ ప్రపంచంలో నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్‌కు భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద షాకిచ్చాడు. ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ టోర్నీలో జరిగిన 8వ రౌండ పోటీలో కార్లసన్‌పై విజయం సాధించాడు. నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లో కార్లసన్‌ను ఓడించాడు. దీంతో వరుసగా మూడు విజయాలతో దూసుకెళ్తున్న కార్లసన్ జోరుకు ప్రజ్ఞానంద బ్రేక్ వేశాడు…ఇప్పటికి ఈ టోర్నీలో ఎనిమిది రౌండ్లు ముగిశాయి. వీటిలో ప్రజ్ఞానంద రెండు విజయాలు, రెండు డ్రాలు సాధించి, నాలుగు పరాజయాలు మూటగట్టుకున్నాడు. దీంతో అతను 8 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు. కొన్ని నెలల క్రితం కార్లసన్ చేతిలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఓడిపోయిన రష్యా చెస్ ప్లేయర్ ఇయాన్ నెపోనియాచి ఈ టోర్నీలో అగ్రస్థానంలో ఉన్నాడు…ఇక టోర్నీ విషయానికొస్తే.. ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ అనేది 16 మంది ఆటగాళ్లు పాల్గొనే ఆన్‌లైన్ ర్యాపిడ్ టోర్నమెంట్. దీని ప్రిలిమినరీ రౌండ్లలో ప్లేయర్లకు విజయానికి మూడు పాయింట్లు, డ్రా అయితే చెరొక పాయింటు వస్తుంది. ఈ టోర్నీలో ఇంకా ఏడు రౌండ్లు మిగిలి ఉన్నాయి.