భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ అనుదీప్‌ భార్య మాధవి భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో కాన్పు..

*ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్‌ సతీమణికి కాన్పు*

R9TELUGUNEWS.COM.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ అనుదీప్‌ భార్య మాధవి భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవం కోసం కలెక్టర్‌ సతీమణి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రిలో చేరారు. డీసీహెచ్‌ఎస్‌ డా.ఎం.ముక్కంటేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.రామకృష్ణ ఆధ్వర్యంలో వైద్యులు ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించారు. రాత్రి ఒంటి గంట సమయంలో కలెక్టర్‌ సతీమణికి సిజేరియన్‌ చేశారు. పండంటి మగ బిడ్డ జన్మించడంపై కలెక్టర్‌ అనుదీప్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. కొంతకాలంగా ఈమె ఇక్కడి ఆసుపత్రికి వచ్చి గైనకాలజిస్టుల సలహాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకం కలిగించేందుకు కలెక్టర్‌ చేసిన ప్రయత్నం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.