లక్నో సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ , అద్భుత విజయం..

కొత్త జట్ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో జరిగిన మ్యాచ్ అందరినీ ఆకట్టుకుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై అద్భుత విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. మొహమ్మద్ షమీ 3 వికెట్లు తీయగా… వరుణ్ ఆరోన్ 2 వికెట్లు తీశాడు. మరో వికెట్ ను రషీద్ ఖాన్ అందుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఒక దశలో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయేలా కనిపించింది. 15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 4 వికెట్లకు 91 పరుగులు చేసింది. ఆ సమయంలో గుజరాత్ గెలవాలంటే 30 బంతుల్లో 68 పరుగుల చేయాల్సి ఉంది. అయితే లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చెత్త కెప్టెన్సీతో మ్యాచ్ ను చేజార్చుకున్నాడు. పేసర్లకు ఓవర్లు ఉన్నా… స్పిన్నర్లతో బౌలింగ్ చేయించి మూల్యం చెల్లించుకున్నాడు. రాహుల్ తెవాటియా (24 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (21 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) జట్టును విజయం వైపు నడిపారు. చివర్లో మిల్లర్ అవుటైనా… అభినవ్ మనోహర్ (7 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు) చివర్లో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్ లోనూ సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలవడంతో… ఐపీఎల్ లో ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్ ల్లోనూ కూడా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది…
159 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ ను దుష్మంత చమీర దెబ్బ తీశాడు. శుబ్ మన్ గిల్ (0), విజయ్ శంకర్ (4)లను అవుట్ చేసి లక్నో టీంకు బ్రేక్ అందించాడు. ఈ దశలో మ్యాథ్యూ వేడ్ (29 బంతుల్లో 30; 4 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నారు. వీరు మూడో వికెట్ కు57 పరుగులు జోడించారు. అనంతరం వీరు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. ఈ దశలో లక్నో బౌలర్లు కూడా మంచిగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ పరుగులు చేయడానికి కష్టపడింది. క్రీజులో ఉన్న మిల్లర్, తెవాటియా 16వ ఓవర్ నుంచి రెచ్చిపోయారు. దుష్మంత చమీర, అవేశ్ ఖాన్ లకు ఓవర్లు మిగిలి ఉన్నా… దీపక్ హుడాతో 16వ ఓవర్ వేయించిన రాహుల్ మూల్యం చెల్లించుకున్నాడు. దీపక్ హుడా వేసిన 16 ఓవర్ లో 22 పరుగులు రాబట్టిన గుజరాత్… అనంతరం బిష్ణోయ్ బౌలింగ్ లోనూ 17 పరుగులు రాబట్టారు. ఇక చివరి ఓవర్లలో 11 పరుగులు అవసరం కాగా 3 ఫోర్లు బాదిన గుజరాత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.