హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు భారీగా వరద నీరు..! రెండు గేట్ల ద్వారా దిగువకు వరద నీరు విడుదల..!!

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను శుక్రవారం జలమండలి అధికారులు ఎత్తారు. రిజర్వాయర్ రెండు గేట్లను ఒక ఫీటు మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్‌కు 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, 700 క్యూసెక్కుల అవుట్ ఫ్లో గా దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు శనివారం ఉదయం మరో రెండు గేట్లని తెరిచారు.
మొత్తం నాలుగు గేట్లను ఒక ఫీట్ మేరకు ఎత్తి 2750 క్యూసెక్కుల నీటిని దిగకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్‌కు కూడా ఎగువ ప్రాంతాలైన చేవెళ్ల, శంకర్ పల్లి, వికారాబాద్ తదితర ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వస్తుంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1785.40 అడుగులకు నీటి మట్టం చేరింది. వెయ్యి క్యూ సెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే సాయంత్రం కల్లా ఉస్మాన్ సాగర్‌కు చెందిన రెండు గేట్లను కూడా ఎత్తే యోచనలో అధికారులు ఉన్నట్టు సమాచారం.