వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం…హమూన్‌’ పేరు…!

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం తుఫానుగా మారినట్టు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందినట్టు పేర్కొంది. దీనికి ‘హమూన్‌’ అనే పేరును ఇరాన్‌ సూచించిందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం గంటకు 13 కి.మీ. వేగంతో ఈశాన్య దిశగా ప్రయాణిస్తున్న ఈ తుఫాను ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు 300 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని ధిగాకు 400 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని హెపుపరాకు 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

అక్టోబర్‌ 25న మధ్యాహ్నం బంగ్లాదేశ్‌లోని హెపుపరా, చిట్టగాంగ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను కారణంగా రాబోయే రెండు రోజులు ఒడిశా సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అప్రమత్తం చేసింది. మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, దక్షిణ అసోంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని, మత్స్యకారులు బుధవారం వరకు చేపల వేటకెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది.ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లోని తీరంలోని పలు ప్రాంతాల్లో అక్టోబరు 24న మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బెంగాల్ తీరంలో తుఫాను ప్రభావంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పింది. ఒడిశా, బెంగాల్, బంగ్లాదేశ్, మాయన్మార్ తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఒక్కోసారి ఇది 60 కి.మీ.కు చేరుకుంటుందని హెచ్చరించింది. మరోవైపు, గత 24 గంటల్లో ఒడిశాలో 15 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. మంగళవారం కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భద్రక్, కేంద్రపడ, జగత్సింగ్‌పూర్ జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల దాదాపు 11 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది…మరోవైపు, అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను ఆదివారం తీవ్ర తుఫానుగా మారింది. ఇది క్రమంగా యెమెన్ తీరంవైపు ప్రయాణిస్తూ.. మంగళవారం ఉదయం అక్కడ తీరం దాటినట్టు ఐఎండీ తెలిపింది. అందువల్ల దీని ప్రభావం భారత్‌పై ఏమీ లేదని చెప్పింది.