దక్షిణ కొరియాలోని నార్త్ జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్ కౌంటీలోని ఉల్జిన్‌లో కార్చిచ్చు… పక్కనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌…

దక్షిణ కొరియాలోని నార్త్ జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్ కౌంటీలోని ఉల్జిన్‌లో శుక్రవారం కార్చిచ్చు రేగింది. అయితే ఆరు ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లు వున్న ఉల్జిన్‌లోని హనుల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ వరకు మంటలు వ్యాపించకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు..ప్రాంతంలోని అణు విద్యుత్ ప్లాంట్‌కు మంటలు చెలరేగకుండా చూసేందుకు గాను.. ప్రకృతి విపత్తు హెచ్చరికను జారీ చేశారు. కొరియా ఫారెస్ట్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం.. సియోల్‌కు ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో వున్న నార్త్ జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్ కౌంటీలోని ఓ పర్వతానికి సమీపంలో వున్న రహదారిపై మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం ఇవి చోటు చేసుకుని.. క్షణాల్లోనే పర్వత శిఖరంవైపునకు వ్యాపించాయి..ముందుజాగ్రత్తగా ఈ ప్రాంతానికి దగ్గరలోని నివాసితులను ఖాళీ చేయిస్తున్నారు. ఈ మేరకు కొరియా ఫారెస్ట్ సర్వీస్ నేషనల్ ఫైర్ ఏజెన్సీ (ఎన్ఎఫ్ఏ) లు ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశాయి. మంటలను అదుపు చేసేందుకు గాను 28 అగ్నిమాపక హెలికాఫ్టర్లు, 35 ఫైరింజిన్లు, 400 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సెకనుకు 25 మీటర్ల వేగంతో వీస్తున్న బలమైన గాలి, పొడి వాతావరణం కారణంగా మంటలను అదుపు చేయడంలో అగ్నిమాపక సిబ్బంది మరింత శ్రమించాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. అయితే ఆరు ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లు వున్న ఉల్జిన్‌లోని హనుల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ వరకు మంటలు వ్యాపించకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈమేరకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫైర్ ఏజెన్సీ చీఫ్ హ్యూంగ్ క్యో.. ఉత్తర జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్ ప్రాంతీయ అగ్నిమాపక శాఖను ఆదేశించారు…