రోగి కాలిని ఎలుక కొరికేసిన ఘ‌ట‌న‌పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు సీరియ‌స్‌…

వ‌రంగ‌ల్ ఎంజీఎం దవాఖానాలో చికిత్స పొందుతున్న రోగి కాలిని ఎలుక కొరికేసిన ఘ‌ట‌న‌పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు సీరియ‌స్‌గా స్పందించారు. ఈ ఘ‌ట‌న‌పై మంత్రి విచార‌ణ‌కు ఆదేశించారు. ఇప్ప‌టికే ఆ రోగి చికిత్స పొందుతున్న వార్డును అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. వ‌రంగ‌ల్‌లోని భీమారానికి చెందిన శ్రీనివాస్ అనే వ్య‌క్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతూ గ‌త శ‌నివారం ఎంజీఎంలో చేరాడు. ఆదివారం తెల్ల‌వారుజామున నిద్రలో ఉన్న శ్రీనివాస్ కాలివేలిని ఎలుక కొరికేసింది. డాక్టర్లకు చెరప్పగా.. వారు చికిత్స చేశారు. కాగా నేటి ఉదయం ఎలుకలు మరోసారి శ్రీనివాస్ కాలివేళ్లను కొరికాయి. దీంతో తీవ్రంగా రక్త స్రావమైంది. ఇప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీనివాస్ మరింత అనారోగ్యానికి గురయ్యాడు. విషయం గురించి తెలుసుకున్న వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు ఘటన పట్ల సీరియస్ గా స్పందించారు. విచారణకు ఆదేశించారు. నివేదిక అందిన అనంతరం నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీఎం సూపరిండెంట్ శ్రీనివాస్ రావును ట్రాన్స్ ఫర్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. గతంలో ఎంజీఎంకి సూపరింటెండెంట్ గా పనిచేసిన చంద్రశేఖర్ కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు…