కిడ్నీ వ్యాధులకు సూచికలు!

కిడ్నీ సంబంధిత వ్యాధులను చాలా లక్షణాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు. ఆ లక్షణాలేంటో తెలుసుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకుని కిడ్నీ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. చాలా లక్షణాలు మనలో కిడ్నీల పనితీరు దెబ్బతిన్న తొలిదశలో ఏర్పడుతాయి. వీటిని ముందుగానే గుర్తిస్తే కిడ్నీ వ్యాధులను తొలిదశలోనే నియంత్రించవచ్చు. మరి కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కనిపించే సమస్యలు వాటిగల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొందరిలో సరిగా నిద్ర పట్టదు.. నీరసంగా ఉండటం.. చర్మం ఎండిపోయి, దురదగా ఉండటం వంటివి బాధిస్తుంటాయి. ఇవి కిడ్నీ సంబంధిత వ్యాధులకు సూచికలు కావొచ్చు. ఇవేకాదు మనం సాధారణమైనవిగా భావించే చాలా లక్షణాలు మనలో కిడ్నీల పనితీరు దెబ్బతిన్న తొలిదశలో ఏర్పడుతాయి. వీటిని ముందుగానే గుర్తిస్తే.. కిడ్నీ వ్యాధులను తొలిదశలోనే నియంత్రించవచ్చు. అయితే ఈ లక్షణాలకు ఇతర కారణాలూ ఉండేందుకు అవకాశముంది. అందువల్ల కేవలం ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన కిడ్నీ సమస్యలు ఉన్నట్లుగా భావించవద్దు. అయితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. తగిన వైద్య పరీక్షలు చేయించుకుని సమస్య ఏమిటో నిర్ధారించుకోవడం అవసరం. మరి కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కనిపించే సమస్యలు, కారణాలేమిటో తెలుసుకుందాం.. సరిగా నిద్ర పట్టకపోవడం మన శరీరంలో కిడ్నీలు సరిగా పనిచేయకపోతే సరిగా నిద్రపట్టని పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే రక్తంలో చేరే వ్యర్థాలు, విషపూరిత రసాయనాలు శరీరం నుంచి బయటికి విసర్జించబడవు. దీనివల్ల రక్తంలో విషపూరిత పదార్థాల శాతం పెరిగిపోయి.. శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది.

ఇది నిద్ర పట్టని పరిస్థితికి దారితీస్తుంది. ముఖ్యంగా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి సాధారణంగా స్లీప్ అప్నియా (గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా శ్వాస ఆడని పరిస్థితి) సమస్య వస్తుంటుంది. విపరీతంగా గురక సమస్య ఉన్న వారికి కూడా కిడ్నీ సమస్యలు ఉండే అవకాశం ఎక్కువ. అలాంటివారు వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.

తలనొప్పి, నీరసం, బలహీనత.. ఆరోగ్యవంతమైన కిడ్నీలు మన శరీరం విటమిన్ డిని సంగ్రహించుకునేలా మార్చుతాయి. దాని వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. దీంతోపాటు ఎరిత్రోపొయెటిన్ (Erythropoietin-EPO) అనే హార్మోన్ ను విడుదల చేస్తాయి.

ఈ హర్మోన్ శరీరంలో ఎముకలు బలంగా ఉండటానికి, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావడానికి తోడ్పడుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో EPO హార్మోన్ సరిగా ఉత్పత్తి కాదు. దానివల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోయి.. కండరాలు, మెదడు బలహీనం అవుతాయి.

తీవ్రమైన కిడ్నీల వ్యాధి (Chronic Kidney Disease)తో బాధపడేవారికి రక్త హీనత (ఎనీమియా) సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా కిడ్నీల పనితీరు 50 శాతంకన్నా తగ్గినప్పుడు ఈ సమస్య మొదలవుతుంది. తగినంత విశ్రాంతి, నిద్ర ఉన్నా కూడా తరచూ అలసి పోయినట్లు ఉండటం, నీరసంగా ఉండటం వంటివి జరిగితే కిడ్నీలకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. చర్మం ఎండిపోయి, దురదగా ఉండటం కిడ్నీలు శరీరంలో మలినాలను, వ్యర్థ రసాయనాలను తొలగిస్తాయని తెలిసిందే.

అదే సమయంలో శరీరానికి అత్యవసరమైన లవణాలు తగిన స్థాయిలో ఉండేలా చూస్తాయి. అలాగాకుండా కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. మలినాలు, వ్యర్థాలు శరీరంలో పేరుకుపోవడం, తగినంతగా లవణాల స్థాయి కొనసాగకపోవడంతో.. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

ఆ వ్యర్థాలను విసర్జించేందుకు చర్మం ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో మలినాలు, వ్యర్థాల ప్రభావానికిలోనై చర్మం ఎండిపోవడం, దురదగా ఉండడం వంటి లక్షణాలు వస్తాయి. ఎప్పుడూ చర్మం ఎండిపోయినట్లుగా ఉంటుండటం, దురదగా ఉంటుండటం వంటివి కనిపిస్తే.. కిడ్నీ సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా మూత్రానికి లేవాల్సి వస్తుంది. మూత్రంలో రక్తం కనిపించడం కూడా కిడ్నీలు దెబ్బతిన్నదానికి సూచన. ఆరోగ్యవంతమైన కిడ్నీలు రక్తంలోని మలినాలను, వ్యర్థ రసాయనాలను జల్లెడపట్టి తొలగిస్తాయి. కానీ కిడ్నీలు దెబ్బతింటే.. మలినాలు, వ్యర్థాలను జల్లెడ పట్టడంతోపాటు రక్తం కూడా మూత్రంలోకి లీకవుతుంది. మూత్రం నురగగా వస్తుండడం, బుడగల్లాంటివి ఏర్పడడం అంటే కిడ్నీలు దెబ్బతిని మూత్రంలో ప్రొటీన్లు వెళ్లిపోతున్నాయని అర్థం. అందువల్ల వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.