ఒకరి తల మరొకరికి అమర్చి ప్రయోగం..!

హెడ్‌ట్రాన్స్‌ప్లాంట్‌’ సాధ్యమేనంటున్న అమెరికా స్టార్టప్‌..

2008లో వచ్చిన హాలీవుడ్‌ సైన్స్‌ఫిక్షన్‌ సినిమా ‘ఎక్స్‌ ఫైల్‌ ఐ వాంట్‌ టూ బిలీవ్‌’ చూశారా? ఈ మూవీలో ఒక వ్యక్తి తలను మరో వ్యక్తికి (హెడ్‌ట్రాన్స్‌ప్లాంట్‌) అమరుస్తారు. అయితే, ఈ సినిమాలో జరిగినట్టు నిజజీవితంలో ఒక వ్యక్తి తలను మరొకరికి అమర్చడం సాధ్యమా? అంటే.. అవునంటున్నది అమెరికాకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ‘బ్రెయిన్‌బ్రిడ్జ్‌’. ‘హెడ్‌ట్రాన్స్‌ప్లాంట్‌’ ఎలా చేయవచ్చో.. రోబోలతో చిత్రీకరించిన వీడియోనూ సోషల్‌మీడియాలో విడుదల చేసింది…ఏమిటీ ‘హెడ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌’?

ప్రమాదాల్లో అవయవాలు కోల్పోవడం, లేదా దెబ్బ తినడం జరిగితే దాతల నుంచి సేకరించిన అవయవాలను తీసుకొని ‘ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌’ చేసినట్టే ఒక వ్యక్తి తలను మరొకరికి అమర్చడాన్ని ‘హెడ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌’ అంటారు.

వీడియోలో ఏముంది?

‘బ్రెయిన్‌ బ్రిడ్జ్‌’ విడుదల చేసిన వీడియోలో రెండు రోబోలు .. ఒక రోబో తలను మరో రోబోకు ఎలా అమర్చవచ్చో చూపించారు. స్టేజీ-4 క్యాన్సర్‌, పక్షవాతం, బ్రెయిన్‌ డెడ్‌, అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌ వంటి నాడీ సంబంధ వ్యాధులతో సతమతమయ్యేవారి తలను తొలగించి, అప్పుడే మరణించిన వారి తలను పెట్టవచ్చని ‘బ్రెయిన్‌ బ్రిడ్జ్‌’ వీడియోలో పేర్కొంది.

నిజంగానే సాధ్యమా?

‘హెడ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌’ ప్రయోగం కొత్తదేం కాదు. ఈ తరహా ప్రయోగాలు 1900లోనే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు జంతువులపై ఈ ప్రయోగాలు చేశారు. 1954లో సోవియెట్‌ యూనియన్‌కు చెందిన ఓ సర్జన్‌ ఓ కుక్కకు ‘హెడ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌’ చేశాడు. అయితే, సున్నితంగా ఉండే నాడీవ్యవస్థ, రక్తనాళాలు పనిచేయకపోవడంతో ఆ కుక్క కొన్ని రోజులకే మరణించింది. అందుకే, ‘బ్రెయిన్‌బ్రిడ్జ్‌’ వీడియోపై నెటింట్లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి..