రాష్ట్రంలో ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ కై ఒక్కొక్కరికి గరిష్ఠంగా 30 ఆరోగ్య పరీక్షలు ఉచితంగా..

రాష్ట్రంలో ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించడంలో భాగంగా ఒక్కొక్కరికి గరిష్ఠంగా 30 ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ప్రయోగాత్మకంగా రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో 18ఏళ్ల పైబడిన వారి ఆరోగ్య వివరాల్ని సేకరిస్తారు. ఫలితాల్ని ‘ఈ-హెల్త్‌’ మొబైల్‌ యాప్‌లో పొందుపరుస్తారు. ఈ యాప్‌లో వివరాల్ని చూసుకునేందుకు ప్రతి ఒక్కరికి ఏకీకృత నంబరు కేటాయిస్తారు. శిక్షణ పొందిన బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఒక్కో బృందం ప్రతి రోజు 10 కుటుంబాల్లోని సుమారు 40 మంది ఆరోగ్య వివరాల్ని సేకరిస్తారు. ఇప్పటికే సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లో ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహించారు. 1,250 జనాభా గల ఆ గ్రామంలో 23 బృందాలు గత జనవరిలో వివరాలు నమోదు చేశాయి.

*సర్వేలో ఏం చేస్తారంటే..?*

* ప్రతి బృందంలో ఇద్దరు ఆశా కార్యకర్తలు, ఒక ఏఎన్‌ఎం ఉంటారు. ఒక్కో బృందం 40 మంది వివరాలు సేకరిస్తుంది.

* ఆధార్‌ తప్పనిసరిగా నమోదు చేయనున్నారు. వ్యక్తుల సామాజిక వివరాలతో పాటు రక్తనమూనాల్ని సేకరిస్తారు. 18 ఏళ్ల పైబడిన వారి ఆరోగ్య పరిస్థితిపై మదింపు చేస్తారు. ఈ వివరాల నమోదుకు ఇప్పటికే ప్రత్యేక మొబైల్‌యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.

* ప్రతి ఒక్కరికి హిమోగ్లోబిన్‌, రాండమ్‌ బ్లడ్‌షుగర్‌(ఆర్‌బీఎస్‌) పరీక్షలు చేస్తారు. రిస్క్‌ అసెస్‌మెంట్‌ అల్గారిథమ్స్‌ పరిజ్ఞానం ఆధారంగా ఆరోగ్యపరంగా అధికముప్పు ఉన్న వ్యక్తుల్లో 40శాతం మందికి అక్కడికక్కడే బార్‌కోడింగ్‌ చేసి రక్తనమూనాల్ని సేకరిస్తారు.

* రక్తనమూనాల్ని తొలుత సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి.. తర్వాత డయాగ్నోస్టిక్‌ హబ్‌కు తరలిస్తారు. ఫలితాల వివరాలను సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తారు. అలాగే మొబైల్‌యాప్‌లో నమోదు చేస్తారు. ఈ వివరాలు ‘తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డ్‌’లో నమోదవుతాయి.