కిలో కాలిఫ్ల‌వ‌ర్ రూ.100.. వంకాయ రూ.80..

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో సామాన్యుడి జేబుపై భారం పెరిగి బడ్జెట్ అధ్వానంగా మారుతోంది. నోయిడాలోని కూరగాయలు, పండ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు తమకు కూడా పెరిగిన ధరకే సరుకులు అందుతున్నాయని చిల్లర వ్యాపారులు పేర్కొంటున్నారు. కిలో కాలిఫ్ల‌వ‌ర్ రూ.100 ప‌లుకుతున్న‌ది. కిలో వంకాయ‌ల‌కు కూడా రూ.80 ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తున్న‌ద‌ని ఢిల్లీ వాసులు చెబుతున్నారు. స‌ఫాల్ స్టోర్స్‌లోనూ కూర‌గాయ‌లు, పండ్ల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని నొయిడా వాసులు కూడా చెబుతున్నారు. చిల్ల‌ర వ‌ర్త‌కులు సైతం తాము అధిక ధ‌ర‌ల‌కే కూర‌గాయ‌లు, పండ్లు, ఇత‌ర సామాన్లు కొనుగోలు చేయాల్సి వ‌స్తున్న‌ద‌ని చెబుతున్నారు.

స‌ఫాల్ స్టోర్ల‌లో బంగాళా దుంప‌లు కిలో రూ.18-22, కాలిఫ్ల‌వ‌ర్ కిలో రూ.98, వంకాయ కిలో రూ.45, ట‌మాటా రూ.54 ప‌లుకుతున్న‌ది. చిన్న దుకాణాదారుల వ‌ద్ద కిలో బంగాళ‌దుంప‌లు రూ.25-30, కాలిఫ్ల‌వ‌ర్ కిలో రూ.100, కిలో వంకాయ రూ.80, కిలో ట‌మోటా రూ.50 ల‌కు ల‌భిస్తున్నాయి. ఢిల్లీకి, ఎన్సీఆర్ ప‌రిధిలోని దుకాణాల‌కు సాహిబాబాద్ ప్రాంత పంట పొలాల నుంచి కూర‌గాయ‌లు తీసుకొస్తార‌ని చిన్న వ్యాపారులు అంటున్నారు.

ఎడ‌తెరిపి లేని వ‌ర్షాలు, అధిక ర‌వాణా ఖ‌ర్చుతో స‌ర‌ఫ‌రా లేక కూర‌గాయ‌లు, పండ్ల ధ‌ర‌లు పెరిగిపోయాయ‌ని కూర‌గాయ‌ల వ్యాపారులు చెబుతున్నారు. ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల‌తో కూర‌గాయ‌ల తోట‌లు దెబ్బ‌తిన్నాయ‌ని, కొర‌త వ‌ల్ల మార్కెట్‌లో ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని అంటున్నారు.