హమాస్‌కు చెందిన ఏకైక మహిళా నాయకురాలును. హతమార్చిన ఇజ్రాయల్ సైన్యం ..!

ఇజ్రాయెల్‌తో పెట్టుకున్న పోరుకి ప్రతిఫలంగా హమాస్‌కి ఒకదాని తర్వాత మరొక ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమని ఇబ్బంది పెట్టిన హమాస్‌ని పూర్తిగా సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్..ఇప్పటికే పలువురు హమాస్‌కి చెందిన కీలక వ్యక్తుల్ని చంపేసింది.
ఇప్పుడు మరో సీనియర్ అధికారిని ఇజ్రాయల్ హత్య చేసింది. రిపోర్ట్ ప్రకారం.. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ సభ్యురాలు అయిన జమీలా అల్-శాంతి మృతి చెందారు.

ఇంతకీ జమీలా అల్-శాంతి ఎవరు?

హమాస్ సహ వ్యవస్థాపకుడు అయితే అబ్దెల్ అజీజ్ అల్-రాంటిసి భార్యే జమీలా అల్-శాంతి. ఈమె హమాస్‌కు చెందిన ఏకైక మహిళా నాయకురాలు. జమీలా హమాస్ రాజకీయ బ్యూరో సీనియర్ సభ్యురాలిగా ఉన్నారు. 2021లో పొలిటికల్ బ్యూరోకు ఈమె ఎన్నికయ్యారు. అప్పటి నుంచి హమాస్ పొలిట్ బ్యూరో వ్యవహారాల్ని చూసుకుంటున్న జమీలా.. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. అయితే.. ఈ హత్య ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా చేసిందా? లేదా? అసలు ఎక్కడ చంపింది? అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.ఇప్పటికే హమాస్‌కి గట్టి దెబ్బ

హమాస్‌ని నిర్మూలించడమే లక్ష్యంగా దూసుకుపోతున్న ఇజ్రాయెల్.. ఈ వారం ప్రారంభంలో సీనియర్ హమాస్ సాయుధ కమాండర్ ఐమన్ నోఫాల్‌ని హతమార్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ఆర్మీ ధృవీకరించింది. అతనితో పాటు నుఖ్బా యూనిట్‌కు చెందిన సదరన్ ఖాన్ యూనిస్ బెటాలియన్ కమాండర్ బిలాల్ అల్-కేద్రాను కూడా సైన్యం హతమార్చిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేర్కొంది. అలాగే.. ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేయగా, హమాస్ ఎయిర్ గ్రూప్ అధిపతి అబూ మురాద్ మరణించాడు.
హిజ్బుల్లాను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్

హమాస్‌తో పాటు హిజ్బుల్లాని సైతం టార్గెట్ చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) గురువారం స్పష్టం చేశాయి. లెబనాన్‌లోని హిజ్బుల్లా రహస్య స్థానాల్ని ఇప్పటికే లక్ష్యంగా చేసుకున్నట్టు ఐడీఎఫ్ పేర్కొంది. ఓ వార్తా సంస్థ ప్రకారం.. గురువారం ఉదయం దక్షిణ లెబనాన్‌లోని రెండు గ్రామాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది.