ఉత్తరాఖండ్‌లోని హిమాలయన్ టౌన్ భూమి కుంగిపోతుంది…

ఉత్తరాఖండ్‌లోని హిమాలయన్ టౌన్ జోషిమఠ్‌ (Joshimath)లోని ఇండ్లకు పగుళ్లు వస్తూ, భూమి కుంగిపోతుండటంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జాతీయ వైపరీత్యాల నిరోధక బృందాన్ని (NDRF) తక్షణం రంగంలోకి దిగాలని శుక్రవారంనాడు ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాగం, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కూడిన నిపుణుల బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటి సర్వే చేపడుతోంది. గార్వాల్ కమిషనర్ సుశీల్ కుమార్, డిజాస్టర్ మేనేజిమెంట్ సెక్రటరీ రంజిత్ కుమార్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.కాగా, ఇంతరవకూ 561 ఇళ్లు బీటలు వారినట్టు ఛమోలీ జిల్లా యంత్రాంగం గుర్తించింది. వాటిలో రవిగ్రామ్ వార్డులో 153 ఇళ్లు, గాంధీనగర్ వార్డులో 127, మార్వాడీ వార్డులో 28, లోయర్ బజార్ వార్డులో 24, సింగ్దర్ వార్డులో 52, మనోహర్ బాగ్ వార్డులో 71, అప్పర్ బజార్ వార్డులో 29, సునీల్ వార్డులో 27, పార్సరిలో 50 ఇళ్లు బీటలు వారినట్టు గుర్తించామని జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం-2005 కింద హోటల్ వ్యూ, మలరి ఇన్‌లో పర్యాటకులను రాకపోకలను నియంత్రించారు. మంగళవారంనాడు తొమ్మిది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, వీటిలో జోషిమఠ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన నాలుగు కుటుంబాలు, గురుద్వారా జోషిమఠ్‌కు చెందిన ఒక కుంటుంబం, టూరిస్ట్ హోటల్ నుంచి, మనోహర్ బాగ్, ఇతర ప్రాంతాలకు చెందిన కుటుంబాలు ఉన్నారు. ఇంతవరకూ 38 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు..