సెప్టెంబర్ 14- హిందీ భాషా దినోత్సవం…!

హిందీ నేర్చుకుందాం

(సెప్టెంబర్ 14- హిందీ భాషా దినోత్సవం)

భారత రాజ్యాంగం గుర్తించిన 22 అధికార భాషల్లోహిందీ ఒకటి. ప్రతి ఒక్కరు హిందీనీ సులభంగా అర్ధం చేసుకోవచ్చు.గాంధీజీ, నెహ్రూ, నేతాజీలాంటి గొప్ప నేతలు స్వాతంత్ర్య సంగ్రామంలో హిందీ ద్వారానే ప్రజల్లో చైతన్యాన్ని మేల్కొల్పారు. బంగ్లాదేశ్‌, నేపాల్‌, మారిషస్‌, పీజీ, జపాన్‌, గయానా, సురినామ్‌, ట్రినిడాడ్‌, హాలండ్‌, హాంకాంగ్‌, థాయిలాండ్‌, సింగపూర్‌, జాంబియా, కెనడా, హూలాండ్‌, స్విట్జర్‌లాండ్‌, హంగేరి, రష్యా, చైనా, ఖతార్‌, అమెరికా మొదలైన దేశాల్లో హిందీ తన విలక్షణ శైలితో ప్రతిష్టించబడింది.హిందీ నేడు అంతర్జాతీయంగా తన విశిష్టతను,ఔన్నత్యాన్ని సంపాదించుకుంది.

హిందీ మనదేశపు సంస్కృతి ,సభ్యతలకు, అభివృద్ధికి అద్దం పడుతుంది. మనదేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పరస్పర భావ వ్యక్తీకరణకు హిందీనే ఎక్కువగా ఉపయోగిస్తారు.అయితే హిందీని ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలలో మాట్లాడతారు.

మాతృభాషతోపాటు ఏకత్వాన్ని ప్రతిబింబించే మధురమైన హిందీ భాషను కూడా ప్రతిఒక్కరూ నేర్చుకుంటే మంచిది. నేడు కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పరస్పరం మాట్లాడుకోవడానికి మాద్యమంగా హిందీని ప్రయోగిస్తున్నారు. ఇందులో విశేషంగా భారతీయ సినిమా రంగం పాత్ర కనిపిస్తుంది.

హిందీ లిపి దేవనాగరి. దీని విశిష్టత ఉచ్ఛారణను అనుసరించి రాయడం, చదవడం జరుగుతుంది.ఇతర భాషలకన్నా హిందీని అర్థం చేసుకోవడం చాలా సులభం. స్వాతంత్ర్య ఉద్యమంలో విశిష్ట శైలితో పరస్పర వ్యక్తీకరణకు మాద్యమంగా హిందీ ప్రధాన భూమికను పోషించింది. యునెస్కో ప్రకారం అత్యధిక సంఖ్యలో అర్థం చేసుకునే భాషగా హిందీ ప్రథమస్థానంలో ఉంది. అదే జనాభా దృష్ట్యా చూస్తే హిందీ మాట్లాడే వారి సంఖ్య మూడోస్థానంలో ఉంది. ప్రసార మాధ్యమంలో కూడా హిందీకి తన సుస్థిర స్థానం ఉంది. ఇంటర్నెట్‌, కంప్యూటర్‌ నిపుణులు కూడా దేవనాగరి లిపిని అత్యధికంగా సమర్ధించి స్వీకరించారు.

ప్రజలకు ఒకటి కంటే ఎక్కువ భాషలు తెలుసుంటే మంచిదే.అయితే ఏ భాషనైనా ఎవరిపైనా బలవంతంగా రుద్ధకూడదు.దీన్నిప్రజల యొక్క ఇష్టానికి వదిలివేయడం మంచిది.అప్పుడే భాషా సమైక్యత వస్తుంది.