చరిత్రలో ఈరోజు.. పుల్వామా అమరవీర సైనికులకు సలామ్‌.

*చరిత్రలో ఈరోజు.. పుల్వామా అమరవీర సైనికులకు సలామ్‌*

2019 ఫిబ్రవరి 14.. మధ్యాహ్నం 3 గంటలు.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కాన్వాయ్ శ్రీనగర్-జమ్ము హైవే మీదుగా వెళ్తోన్నది. ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుచుకుపడి బాంబులు పేల్చారు. ఈ ఘటనలో భారత్‌కు చెందిన 40 మంది సైనికులు వీర మరణం పొందారు. సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌ పుల్వామాకు చేరుకోగానే 350 కిలోల పేలుడు పదార్థాలతో నిండివున్న కారుతో బస్సులను ఢీకొట్టారు. రెండు బస్సుల్లో ఒకటి పేలడంతో అందులో ప్రయాణిస్తున్న 40 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ దారుణానికి ఒడిగట్టింది జైష్‌ మహమ్మద్‌ సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా కేంద్ర ప్రభుత్వం తేల్చింది. కశ్మీర్‌లో గత 30 ఏండ్లలో ఇంత పెద్ద దాడి జరుగడం ఇదే మొదటిది. కాన్వాయ్‌లో మొత్తం 2,547 సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఉండగా.. వీరిలో ఎక్కువ మంది సెలవుల నుంచి తిరిగి వచ్చిన వారున్నారు.

పుల్వామా దాడి గత పదేండ్లలో సీఆర్‌పీఎఫ్‌పై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా పేర్కొనవచ్చు. అంతకుముందు 2010 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల దాడిలో 76 మంది సైనికులు అమరవీరులయ్యారు. పుల్వామా దాడి జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ కనుసన్నల్లో జరిగింది. పాకిస్తాన్‌లోని శిబిరంలో బోధకుడిగా పనిచేసిన అబ్దుల్ రషీద్ ఘాజీ వద్ద ఐఈడీ పేలుడులో దార్ శిక్షణ పొందినట్లుగా తెలుస్తున్నది. పుల్వామా దాడికి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ బాధ్యత తీసుకున్నారు. ఈ సంస్థ ప్రధాన సూత్రధారి మసూద్ అజార్ దాడికి 10 రోజుల ముందు ఫిబ్రవరి 5 న కరాచీలో నిర్వహించిన జైష్ ర్యాలీ పాల్గొన్నాడు. ఈ ర్యాలీలో మసూద్ అజార్ తమ్ముడు మౌలానా అబ్దుల్ రౌఫ్ అస్గర్ భారతదేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తానని బెదిరించాడు.

ప్రతీకారం తీర్చుకున్న భారత్‌
పుల్వామా దాడి జరిగిన 13 రోజుల తరువాత భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. 2019 ఫిబ్రవరి 26 రాత్రి భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్ విమానాలు పాకిస్తాన్‌లోకి దూసుకెళ్లి, నియంత్రణ రేఖకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైష్ యొక్క అతిపెద్ద ఉగ్రవాద స్థావరాన్ని నాశనం చేశాయి. బాలకోట్‌లో కూడా బాంబులను పడవేసింది. ఈ బాంబు దాడిలో 350 మంది ఉగ్రవాదులు మరణించారు. ఉరి సంఘటన తరువాత 2016 సెప్టెంబర్‌లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించారు. 48 సంవత్సరాలలో వైమానిక దళం దేశ సరిహద్దును దాటడం ఇదే మొదటిసారి. అంతకుముందు 1971 యుద్ధ సమయంలో వైమానిక దళం మన దేశ సరిహద్దులను దాటింది.

బాలకోట్ వైమానిక దాడి అనంతరం ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. మరుసటి రోజు సరిహద్దులో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఆ తరువాత, పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని అనుసరించి తమ భూభాగంలోకి వచ్చిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ అదుపులోకి తీసుకున్నది. అయితే, తీవ్ర ఒత్తిడి తర్వాత 58 గంటల్లో పాకిస్తాన్ అతన్ని విడుదల చేసింది.

పాస్టర్ వాలెంటిన్ ఉరితీత
రోమ్‌లో క్లాడియస్ II పాలనలో పాస్టర్ వాలెంటిన్‌ను సరిగ్గా ఇదే రోజున ఉరితీశారు. అతని జ్ఞాపకార్థం ఇదే రోజున ప్రేమికుల రోజును జరుపుకుంటారు. క్లాడియస్ చాలా క్రూరమైన పాలకుడు. అతను రోమ్‌లో వివాహాలు, నిశ్చితార్థాలను నిషేధించాడు. ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా పాస్టర్ వాలెంటిన్ రహస్యంగా ప్రేమికులను వివాహం చేసుకోవడానికి ప్రేరేపించాడు. ఈ విషయం తెలుసుకున్న క్లాడియస్‌.. అతన్ని చంపమని సిబ్బందిని ఆదేశిస్తాడు. దాంతో భటులు వాలెంటిన్‌ను అరెస్టు చేసి అనంతరం ఉరితీశారు.

మరికొన్ని ముఖ్య సంఘటనలు
2007: మూడుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్యామ్ చరణ్ శుక్లా కన్నుమూత

2005: స్టీవ్ చెన్, చాడ్ హర్లీ, జావేద్ కరీం అనే యువకులు వీడియోను పంచుకోవడానికి యూట్యూబ్ అనే వెబ్‌సైట్‌ను నమోదు చేశారు. 2006 లో దీనిని గూగుల్ దానిని కొనుగోలు చేసింది.

2003: 8 వ ప్రపంచ కప్‌లో తొలి హ్యాట్రిక్‌ సాధించిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్ చమిందా వాస్

1993: 400 వికెట్లు, 5000 పరుగులు చేసి రికార్డు సృష్టించిన కపిల్‌దేవ్‌

1990: బెంగళూరులో కూలిపోయిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం.. 97 మంది మృతి

1989: సాటానిక్ వెర్సెస్ పుస్తకాన్ని దైవదూషణగా ప్రకటించి.. రచయిత సల్మాన్ రష్దీని చంపిన వారికి బహుమతిని ప్రకటించిన ఇరాన్‌ నాయకుడు అయతుల్లా ఖొమేని.

1952: హర్యానాలోని అంబాలాలో సుష్మా స్వరాజ్ జననం

1876: టెలిఫోన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అలెగ్జాండర్ గ్రాహం బెల్