తెలంగాణలో భూములు, ఇళ్ళ స్థలాలకు భారీ గిరాకీ..ప్రీబిడ్ మీటింగ్స్ సక్సెస్..ఆన్ లైన్ ఆక్షన్ పై ఆసక్తి..
తెలంగాణలో భూములు, ఇళ్ళ స్థలాలకు భారీ గిరాకీ ఏర్పడింది. అందులోనూ ప్రభుత్వం డెవలప్ చేసి అమ్మకానికి పెడితే ఆ లేఅవుట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (hmda) చేపడుతున్న ప్రీ బిడ్ మీటింగ్ లకు అనూహ్య స్పందన లభిస్తోంది. బండ్లగూడ, బహదూర్ పల్లి, ఖమ్మం పరిధిలో నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్స్ సక్సెస్ అయ్యాయి. రాజీవ్‌స్వగృహ భూములు, టవర్స్ కొనుగోలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అధిక సంఖ్యలో హాజరైన ఔత్సాహికులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు…ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న ఆన్ లైన్ వేలం ప్రక్రియ గురించి అధికారులు వారికి అవగాహన కల్పించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్అథారిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మూడు చోట్ల నిర్వహించిన ‘‘ప్రీబిడ్ మీటింగ్స్’’ విజయవంతం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాజీవ్ స్వగృహకు సంబంధించిన ప్లాట్లు, టవర్స్‌ను ఆన్లైన్ వేలం(ఈ–ఆక్షన్) పద్దతిలో విక్రయాలకు పెట్టినసంగతి తెలిసిందే. వాటిలో భాగంగా బండ్లగూడ(నాగోల్–హైదరాబాద్) రాజీవ్ స్వగృహ టవర్స్(అపార్ట్ మెంట్స్) ప్రాంగణంలో శుక్రవారం ఉదయం మొదటి ప్రీబిడ్సమావేశం జరిగింది.మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని బహదూర్ పల్లి(దుండిగల్ మున్సిపాలిటీ)లో 101 ప్లాట్ల విక్రయాలపై శుక్రవారం మధ్యాహ్నం రెండో దఫా ప్రీబిడ్ మీటింగ్ ను హెచ్ఎండిఏ అధికారులు నిర్వహించారు. ఈ రెండు ప్రీబిడ్ సమావేశాలకు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ ఎస్.ఈశ్వరయ్య, హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, ఓఎస్డీ ఎం.రాంకిషన్, సీజీఎం మాజీద్ షరీఫ్ లతో పాటు ఆన్ లైన్ వేలం నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ అధికారులు హాజరయ్యారు..