రేపు హోలీ జరుపుకోవాలా వద్దా..?. పూజారి ఏమంటున్నారు..!

‘హోలీ’ (Holi ) వస్తుందంటే చాలు.. దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి..హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పుర్ణిమ’గా కూడ వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. అయితే ఈసారి హోలీ పండగ విషయంలో అనేక పుకార్లు వినిపిస్తుండడం తో ప్రజలు అయోమయంలో పడిపోయారు.

రేపు చంద్రగ్రహణం (Chandra Grahan 2024) కారణంగా హోలీ జరుపుకోవద్దని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం తో చాలామంది హోలీ జరుపుకోకూడదని భావిస్తున్నారు. మరికొంతమంది అదేమీ లేదు జరుపుకోవచ్చని చెపుతున్నారు. ఇలా రెండు రకాల ప్రచారం జరుగుతుండడంతో ఏది నమ్మాలో..నమ్మకూడదో అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ (Chilkur Balaji Temple Priest Rangarajan) దీనిపై స్పష్టత ఇచ్చారు..భారతదేశంలో రేపు చంద్రగ్రహణం ఉందని వస్తున్న వార్తలపై చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ స్పందించారు. ‘ఇండియాలో రేపు చంద్రగ్రహణం లేదు. ఇది అమెరికా, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంది. ప్రజలందరూ సంతోషంగా హోలీ పండుగ జరుపుకోవచ్చు. ఇలాంటి గ్రహణాలు వస్తే మేము రెండు వారాల ముందే చెబుతాం’ అని ఆయన క్లారిటీ ఇచ్చారు. రంగరాజన్ క్లారిటీ ఇవ్వడం తో అంత హమ్మయ్య అనుకుంటున్నారు.

అన్ని వర్గాల వారికి ఇష్టమైన పండుగ హోలీ. హోలీ సందర్భంగా రేపు (మార్చి 25) తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లోని పాఠశాలలకు హోలీ రోజున సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మార్చి 29న క్రైస్తవుల ముఖ్య పండుగల్లో ఒకటైన గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలంగాణ సర్కారు సాధారణ సెలవు ప్రకటించింది..