హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఒక వ్యక్తి అరెస్ట్..

Hyderabad Drugs: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఒక వ్యక్తి అరెస్ట్..

Hyderabad Drug Case: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను పట్టి పీడిస్తున్న భూతాల్లో ‘డ్రగ్స్’ ఒకటి. ముఖ్యంగా.. యువతీ యువకులు ఈ డ్రగ్స్‌కు బానిసలై, తమ ఉజ్వల భవిష్యత్తుని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు..

ఇది చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ.. దుండగులు అడ్డదారుల్లో ఈ డ్రగ్స్‌ని సరఫరా చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు హైదరాబాద్‌ను ‘డ్రగ్స్ రహిత సిటీ’గా మార్చేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. పంటల్లో చీడపురుగుల్లాగా డ్రగ్స్ అమ్ముతున్న దుండగుల్ని వేటాడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫిలింనగర్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది..

ఫిలింనగర్‌లోని పబ్ పార్కింగ్ ఏరియాలో ఒక వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నాడనే సమాచారం తెలియగానే.. టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి, అతడ్ని అరెస్ట్ చేశారు. బెంగళూరుకి చెందిన ఆ వ్యక్తి పేరు బాబు కిరణ్‌గా తేలింది. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న అతడ్ని పబ్ పార్కింగ్ వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత కొంతకాలం నుంచి పబ్ పార్కింగ్ ఏరియాలో అతడు కొంతమందికి డ్రగ్స్ అమ్ముతున్నాడని అధికారులు గుర్తించారు. దీంతో.. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకోవడం కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు.. బాబు కిరణ్‌ని రిమాండ్‌కి తరలించారు. అతని వద్ద నుంచి 20 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్‌ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..