రాజధానిలో జోరుగా గంజాయి లేడి డాన్ నీతూబాయి..!

హైదరాబాద్‌: తెలంగాణాకే తలమానికంగా నిలుస్తూ ఆర్థిక రాజధానిగా పేరొందిన నానక్‌రాంగూడాలో గంజాయి గుప్పుమంటోంది. ఇక్కడ బహిరంగంగానే మత్తుమందు విక్రయాలు జరుగుతున్నాయి. పోలీసులు చేపట్టిన డెకాయ్‌ ఆపరేషన్‌లోనే ఈ దందా బహిర్గతమైంది. ఇదంతా ఏళ్ల తరబడి నీతూబాయి అనే ఓ మహిళ సాగిస్తుండడం గమనార్హం. గతంలో ఆమెపై పీడీ చట్టం ప్రయోగించి ఏడాది పాటు జైళ్లో ఉంచినా.. విడుదలైన అనంతరం మళ్లీ దందా కొనసాగిస్తుండటం దర్యాప్తు అధికారుల్ని విస్తుపోయేలా చేసింది.
మత్తు కట్టడికి ఏర్పాటైన తెలంగాణ నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (టీన్యాబ్‌) డైరెక్టర్‌ సందీప్‌శాండిల్య మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారంపై రాష్ట్రంలోని అన్ని పోలీసు యూనిట్లను తరచూ అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట కమిషనరేట్‌ పోలీసులకు కొంత సమాచారం లభ్యమైంది. ఇటీవలే ములుగు ప్రాంతంలో చిక్కిన ఇద్దరు గంజాయి విక్రేతలను విచారించడంతో తాము నానక్‌రాంగూడ నుంచి తెచ్చామని వెల్లడించారు. అక్కడ బహిరంగంగానే విక్రస్తున్నారని చెప్పడం వారికి ఆశ్చర్యం కలిగించింది. ధ్రువీకరణ కోసం సిద్దిపేట కమిషనర్‌ అనురాధ ఇటీవల ఒక బృందాన్ని నానక్‌రాంగూడకు పంపించారు. అక్కడ గంజాయి కొనేందుకు పదిహేను మంది వరకు క్యూలో నిలబడి ఉండడం కనిపించింది. పోలీసులూ అదే క్యూలో నిలబడి రూ.5వేల విలువైన గంజాయి కావాలని అడిగారు. నీతూబాయి ఏమాత్రం జంకూగొంకూ లేకుండా సరకు ఇవ్వడంతో తీసుకొని వెనుదిరిగారు. కమిషనర్‌ అనురాధ అదే సమాచారాన్ని సందీప్‌శాండిల్యకు చేరవేశారు…..