హైదరాబాద్‌- నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల పెద్ద ఎత్తున ఆందోళన..

పంటలు కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలకు నిరసనగా శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌ వద్ద హైదరాబాద్‌- నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అఖిలపక్షం నాయకులతోపాటు రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. బీఆర్‌ఎస్‌తోపాటు పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ‘పీఎం ఝాటా, సీఎం ఝూటా.. దోనే మిల్‌కే కాస్త్‌కార్‌కో లూటా’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. మద్దతు ధరతో పంటలను కొనాల్సి ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు, షరతులు విధించిన కారణంగా రైతులు విక్రయించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ విధానంలో పత్తిని కొంటున్న సీసీఐ.. తేమ ఎక్కువ ఉన్నదనే సాకుతో కొనడం లేదని మండిపడ్డారు. ప్రైవేట్‌ వ్యాపారుల వద్దకు వెళ్తే తక్కువకే కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సోయా నిబంధనల కారణంగా రైతుల వేలిముద్రలు పడటం లేదని ఓటీపీ విధానం అమలు చేయకపోవడం రైతుల మార్క్‌ఫెడ్‌ కేంద్రాల్లో పంటను మద్దతు ధరతో విక్రయించుకునే పరిస్థితులు లేవని తెలిపారు. ఈ సదర్భంగా మాజీ మంత్రి జోగు రామన్నతోపాటు రైతు సంఘాల నాయకులు, రైతులు రోడ్డుపైనే జొన్న రొట్టెలు తిని నిరసన తెలిపారు..