‘ఐ బొమ్మ’పై దృష్టి – సంచలన ప్రకటన విడుదల చేసిన పైరసీ వెబ్‌సైట్‌..!

సినిమా, ఓటీటీ పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవల థియేటర్‌లో రికార్డ్ చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు క్రమంలో ఐబొమ్మ వెబ్‌సైట్‌పై దృష్టి పెట్టడంతో దాని నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆ వెబ్‌సైట్‌ కోసం పని చేస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్లలో ఐబొమ్మకు ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు.

మరోవైపు ఓటీటీ కంటెంట్‌ను తస్కరిస్తూ నిర్వాహకులకు తలనొప్పిగా మారడంతో ఐబొమ్మని కట్టడి చేసేందుకు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆ పైరసీ వెబ్‌సైట్‌ నుంచి తెలుగులో ఓ ప్రకటన వెలువడటం సోషల్ మీడియాలో వేదికగా వైరల్‌గా మారింది. కెమెరాల సహాయంతో థియేటర్‌లో సినిమాలను రికార్డు చేస్తున్నామని, అనంతరం ప్రింట్స్‌ విడుదల చేస్తున్న వెబ్‌సైట్స్‌పై దృష్టి పెట్టాలని పోలీసులకు సూచించింది. తాము ఏ దేశంలో ఉన్నా భారత దేశం, అందులో తెలుగు వారి కోసం ఆలోచిస్తామంటూ చెప్పడం గమనార్హం.