1,500 మందికి పైగా మిలిటెంట్లను మట్టుబెట్టిన ఇజ్రాయిల్..బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం డేరింగ్‌ ఆపరేషన్..!

హమాస్‌ మిలిటెంట్ల దాడి తర్వాత గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడుతోంది. ఇప్పటికే 1,500 మందికి పైగా మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు ప్రకటించింది….గాజాకు నీరు, విద్యుత్‌, ఇంధన సరఫరాలు నిలిపివేసి హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ సైనికులు హమాస్‌తో ఏ విధంగా పోరాటం చేస్తున్నారో తెలిపే వీడియోను ఇజ్రాయెల్‌ ఫ్రంట్‌ ఫోర్స్ (IFF).. తమ ఎక్స్ (ట్విటర్‌)లో షేర్‌ చేసింది.

”శనివారం ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందిని హమాస్‌ బందీలుగా చేసుకొంది. గాజా సరిహద్దుల్లో వారిని బంధించిందనే సమాచారంతో ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు (IDF) హమాస్‌ మిలిటెంట్‌ స్థావరాలపై దాడి చేసి, బందీలను సురక్షితంగా విడిపించాయి. ఈ దాడిలో 60 మంది ఉగ్రవాదులను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. హమాస్‌ దక్షిణ నేవీ కమాండర్ మహమ్మద్‌ అబు అలీని మా దళాలు అదుపులోకి తీసుకున్నాయి” అని ట్వీట్‌లో పేర్కొంది.

వీడియోలో ఐడీఎఫ్‌ దళాలు ఉగ్రవాదులు నక్కి ఉన్న గదుల్లోకి తూటాల వర్షం కురిపించాయి. అనంతరం వారిని బయటకు రప్పించేందుకు గ్రనేడ్‌తో దాడి చేసి బంధించాయి. దాడిలో పాల్గొన్న ఓ ఇజ్రాయెల్‌ సైనికుడి బాడీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ఈ వీడియోను ఇజ్రాయెల్‌ సైన్యం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది…హమాస్‌ చెరలో ఇంకా దాదాపు 150 మంది ఇజ్రాయెల్‌, ఇతర దేశాల పౌరులు బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని టన్నెళ్లలో బంధించినట్లు సమాచారం. వారిని విడిపించడం కోసం ఇజ్రాయెల్‌ సైన్యం గ్రౌండ్‌ ఆపరేషన్‌కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే గాజాలోని పౌరులకు ఇజ్రాయెల్‌ సైన్యం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 24 గంటల్లో ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పౌరులు ఆ ప్రాంతాన్ని వీడాలని ఐడీఎఫ్‌ ఆదేశాలు జారీ చేసింది. హమాస్‌ మిలిటెంట్లు వారిని కవచాలుగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని, రాబోయే రోజుల్లో గాజా నగరంపై ఐడీఎఫ్‌ దాడులు పెంచనుందని, ఇందులో అమాయకులైన పౌరులకు నష్టం కలగకూడదని కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.