మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం .

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 177 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది..

223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. అశ్విన్, జడేజా, అక్షర్ ల ధాటికి 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది…ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. ఈ సిరీస్ ముందు వరకు సూపర్ ఫాంలో ఉన్న ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను స్లిప్ లో కోహ్లీ క్యాచ్ తో ఔట్ చేసిన అశ్విన్.. వికెట్ల పతనానికి తెరలేపాడు. ఆ తర్వాత ఏ దశలోనూ ఆస్ట్రేలియా కోలుకోలేదు. అశ్విన్ బౌలింగ్ లో కోహ్లీ క్యాచ్ జారవిడవటంతో బతికిపోయిన వార్నర్ అవకాశాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేదు. 41 బంతుల్లో 10 పరుగులు చేసిన వార్నర్ అశ్విన్ బౌలింగ్ లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత లబూషేన్ (28 బంతుల్లో 17)ను జడేజా వెనక్కు పంపాడు. ఆ తర్వాతంతా అశ్విన్ విశ్వరూపమే చూపించాడు. వరుసగా వికెట్లు పడగొట్టాడు. యాష్ ధాటికి రెన్ షా (7 బంతుల్లో 2), హ్యాండ్స్ కాంబ్ (6 బంతుల్లో 6), అలెక్స్ క్యారీ (6 బంతుల్లో 10) పెవిలియన్ కు క్యూ కట్టారు. ఈ 3 వికెట్లు ఎల్బీ రూపంలోనే రావడం గమనార్హం. ఆ తర్వాత మిగతా పనిని జడేజా, అక్షర్, షమీలు లు పూర్తి చేశారు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 5, జడేజా 2, షమీ 2, అక్షర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.