**
*విరాట్ కోహ్లీపైనే నజర్*
*రాత్రి 7- 30 నుంచి స్టార్ స్పోర్ట్స్ లో…*
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరానికి సమయం ఆసన్నమైంది. ఐసీసీ టోర్నీల్లో తప్ప దైపాక్షిక సిరీస్‌ల్లో ఎదురుపడని.. భారత్, పాకిస్థాన్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు జరుగనుండగా.. యావత్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం కండ్లప్పగించి చూస్తున్నది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు చివరిసారి తలపడగా.. అప్పుడు భారత్‌పై పాక్ గెలిచింది. ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని టీమ్‌ఇండియా తహతహలాడుతుంటే.. బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్థాన్ అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంది! మరింకెందుకు ఆలస్యం మీరు కూడా టీవీలు ట్యూన్ చేసేయండి!!
దుబాయ్: క్రీడా జగత్తులోనే అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న భారత్, పాక్ పోరుకు సర్వం సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్, పాక్ గ్రూప్-‘ఎ’నుంచి బరిలోకి దిగుతున్నాయి. గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టి నిలువనుంది. చానాళ్ల తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్న రన్ మెషీన్.. ఆ స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకుంటాడా.. లేక ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో ఉసూరుమనిపించినట్లు ఇలా వచ్చి అలా వెళ్తాడా చూడాలి. ఇక రికార్డుల పరంగా చూసుకుంటే.. ఇప్పటి వరకు ఏడుసార్లు ఆసియాకప్ చేజిక్కించుకున్న భారత్.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. ప్రస్తుత టోర్నీని దానికి రిహార్సల్‌గా వినియోగించుకోవాలని అన్ని జట్లు ఆశిస్తున్నాయి. ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ చేతిలో ఎన్నడూ ఓడని టీమ్‌ఇండియా.. సరిగ్గా 10 నెలల క్రితం ఇదే మైదానంలో తొలి పరాజయాన్ని రుచిచూసింది. ఇప్పుడందుకు బదులు తీర్చుకోవాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. మరి తీవ్ర ఒత్తిడి ఉండే భారత్, పాక్ పోరులో.. అనిశ్చితికి మారుపేరైన దాయాదిపై మనవాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి.
*ప్రయోగాలు ఫలించేనా..*
స్వదేశంలో తిరుగులేని ఆధిపత్యం.. విదేశాల్లో వరుస సిరీస్ విజయాలు.. టెస్టు, వన్డే, టీ20 ఇలా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా మెగాటోర్నీలకు వచ్చేసరికి చతికిలబడుతున్నది. 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టు ఒక్క ఐసీసీ ఈవెంట్ కూడా నెగ్గలేకపోయింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనైతే మరీ ఘోరంగా లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. ఐపీఎల్, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో దుమ్మురేపుతున్న ఆటగాళ్లు కీలక టోర్నీల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. ఫార్మాట్‌కు ఒక్కో జట్టును బరిలోకి దించేంత మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారంటున్నా.. ఆసలు మ్యాచ్‌కొచ్చేసరికి ఎవరిని ఎక్కడ ఆడించాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో జట్టులోకి వచ్చిన దీపక్ హుడా.. అందివచ్చిన అవకాశాలను సరిగ్గానే వినియోగించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆసియాకప్ తుది జట్టులో అతడికి చోటు దక్కుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న? రాహుల్ అందుబాటులో లేకపోవడంతో ప్రయోగాల పేరుతో ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ ఇలా.. ఎవరిని పడితే వాళ్లను ఓపెనింగ్‌కు పంపి.. ఏ ఒక్క ఆటగాడికీ కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. మరి ఇప్పుడు మెగాటోర్నీలో రోహిత్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడా లేక మరో ప్రయోగంగా.. విరాట్ కోహ్లీకి ఓపెనర్‌గా ప్రమోషన్ ఇస్తారో చూడాలి. కరోనా కారణంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అందుబాటులో లేకపోవడంతో హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. – నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పాండ్యా, పంత్/కార్తీక్, జడేజా, చాహల్, భువనేశ్వర్, అర్శ్‌దీప్, అశ్విన్/అవేశ్ ఖాన్.
పాకిస్థాన్: బాబర్ (కెప్టెన్), రిజ్వాన్, ఫఖర్, ఆసిఫ్, ఇప్తిఖార్, ఖుష్‌దిల్, షాదాబ్, నవాజ్, షానవాజ్, హరీస్, నసీమ్ షా..