టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యం..!!!

సౌత్ ఆఫ్రికా ,,ఇండియా మధ్య రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. 62/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌతాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకు కుప్పకూలింది…జస్‌ప్రీత్ బుమ్రా(6/61) ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు.

ఎయిడెన్ మార్క్‌రమ్(103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 106) సెంచరీతో చెలరేగగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రాకు తోడుగా ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసారు.98 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మార్క్‌రమ్ సెంచరీతో 78 పరుగులు మాత్రమే అదనంగా చేసింది. దాంతో టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది.

పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్‌పై ఈ లక్ష్యాన్ని అందుకోవడం టీమిండియా కాస్త కష్టమైన పనే. ఆచితూచి ఆడుతూ విజయాన్నందుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఘోర పరాజయం చవిచూడాల్సి ఉంటుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) ఆరు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా… జస్‌ప్రీత్ బుమ్రా(2/25), ముఖేష్ కుమార్(2/0) రెండేసి వికెట్లతో రాణించారు.

అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు కుప్పకూలింది. ఓ దశలో 153/4 స్కోర్‌తో పటిష్టంగా కనిపించిన టీమిండియా.. అనంతరం 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది..భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 46), శుభ్‌మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లతో 36), రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లతో 39)మాత్రమే రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడా(3/38), లుంగి ఎంగిడి(3/30), నండ్రే బర్గర్(3/42) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు..